చంద్రుడిపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలే.. ఇక జనం బ్రతికేయచ్చు

చంద్రుడిపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలే.. ఇక జనం బ్రతికేయచ్చు
  • అక్కడి నేల థర్మల్ ప్రొఫైల్ పంపిన విక్రమ్ ల్యాండర్
  • ఉష్ణోగ్రతల వివరాలతో గ్రాఫ్ విడుదల చేసిన ఇస్రో

బెంగళూరు : చందమామ దక్షిణ ధ్రువం గుట్టును విప్పే దిశగా విక్రమ్ ల్యాండర్ తొలి టాస్క్​ను పూర్తి చేసింది. చంద్రుడి నేలపై, దాని కింద ఉష్ణోగ్రతల్లో మార్పులు ఎలా ఉన్నాయన్నది ‘చాస్ట్’ పరికరంతో పరీక్షించి, డేటాను పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నేల థర్మల్ ప్రొఫైల్​ను రికార్డ్ చేయడం ఇదే తొలిసారి అని ఇస్రో ప్రకటించింది. 

విక్రమ్ పంపిన డేటాను బట్టి ఇస్రో ఈమేరకు ఆదివారం ఒక గ్రాఫ్​ను విడుదల చేసింది. శివ శక్తి పాయింట్ వద్ద ఉపరితలంపై 50 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు గ్రాఫ్ లో వెల్లడించింది. నేలపై 2 సెం.మీ. ఎత్తులో 60 డిగ్రీలు,  ఉపరితలం నుంచి 2 సెం.మీ. లోతులో 40 డిగ్రీలు, 4 సెం.మీ. లోతులో 30 డిగ్రీలు, 7 సెం.మీ. లోతులో 0 డిగ్రీలు, 8 సెం.మీ. లోతు వద్ద మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సెన్సర్లతో గుర్తించిన ‘చాస్ట్’ 

చంద్రుడి నేలపై ఉష్ణోగ్రతలను గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్ లోని చాస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ పరిమెంట్) పేలోడ్​లోని పరికరం 
నేలలోపలికి 10 సెంటీమీటర్ల లోతువరకు చొచ్చుకుపోయింది. దీనిలో ఉన్న 10 హైప్రెషిషన్ థర్మల్ సెన్సర్లు నేలపై, దాని కింద, కొంత లోతులో టెంపరేచర్లు ఎలా ఉన్నాయన్న దానిని గుర్తించాయి. ఈ డేటాను సమగ్రంగా విశ్లేషిస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఇస్రో తెలిపింది. 

పగటి టెంపరేచర్లు100 డిగ్రీలు దాటుతయ్  

చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు వేగంగా మారుతుంటాయి. మధ్యాహ్నం ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్షియస్ దాటుతుంది. రాత్రి పూట మైనస్ 100 డిగ్రీలకు పడిపోతుంది. అయితే, చంద్రుడి ఉపరితలంలోని మట్టి కింద ఉండే పలుచటి రాళ్ల పొర ఉష్ణోగ్రతను లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. టెంపరేచర్లను అడ్డుకునే ఈ రాతి పొరనే మానవులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.