
- జాగ్రత్తలు, మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
- విజిటర్ పాస్‌లు రద్దు చేయండి
- మీటింగులొద్దు.. అవసరమైతే తక్కువ మందితోనే..
- ఎంట్రీ పాయింట్‌లోనే దరఖాస్తుల స్వీకరణ
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. సెక్రటేరియట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీలైనంత వరకు ఎవరూ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టాలంది. వచ్చే వాళ్లకు థర్మల్ స్క్రీనింగ్ తప్పకుండా చేయాలని చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఉద్యోగుల్లో పెద్ద వయసు వారు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలంది. అలాంటి వారికి నేరుగా ప్రజలతో అనుసంధానం ఉండే పనిని అప్పగించొద్దని స్పష్టం చేసింది.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలివీ
–ఆఫీసులకొచ్చే వాళ్లను వీలైనంత వరకు కట్టడి చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల విజిటర్ పాస్‌లను రద్దు చేయాలి.
–తప్పనిసరిగా వచ్చే వాళ్లను ఎంట్రన్స్‌ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేశాకే లోనికి పంపించాలి.
–దరఖాస్తులు తీసుకోవడం, సమాచారం ఇవ్వడం ఆఫీసుల ఎంట్రీ పాయింట్ వద్ద నుంచే చేయాలి.
–సమాచారాన్ని ఫైళ్లు, డాక్యుమెంట్లుగా ఇతర కార్యాలయాలకు పంపొద్దు. వాటి ద్వారా కరోనా వ్యాపించొచ్చు. ఈ మెయిల్ విధానం వాడుకోవాలి.
–సమావేశాలను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే జరుపుకోవాలి. తప్పనిసరైతే తక్కువ మందితోనే ముగించాలి.
–అన్ని స్థాయిల అధికారులు అనవసర అధికారిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.
–ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని జిమ్‌లు, శిశు సంరక్షణ కేంద్రాలను మూసేయాలి.
–ఉద్యోగులు పని చేసే చోట తరచూ శానిటేషన్ చేయాలి. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
–శ్వాస సంబంధమైన ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఉంటే ఆ ఉద్యోగి ముందు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. తర్వాత పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. వాళ్లు హోం క్వారంటైన్‌లోనే ఉండాలి.
–సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నవారికి సెలవులివ్వలి.
–సీనియర్ ఉద్యోగులు, గర్భిణులు, తీవ్రమైన వ్యాధులున్న ఉద్యోగులకు ప్రజలతో కలిసే పనులను అప్పగించొద్దు.