కరోనా తర్వాత డిమాండ్ పెరిగిన 4 పాలసీలు ఇవే..

V6 Velugu Posted on Apr 04, 2021

న్యూఢిల్లీ: ఇది వరకు అయితే హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ను జనం పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కరోనా మహమ్మారి తరువాత ప్రతి ఒక్కరికీ ఇది ఎంత ముఖ్యమో తెలిసివచ్చింది. ఆరోగ్య బీమా పాలసీల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. కేవలం హెల్త్‌‌ ఇన్సూరెన్సే కాదు ఇతర పాలసీలూ ముఖ్యమే! సైబర్‌‌, హోమ్‌‌, యూసేజ్‌‌ బేస్డ్ సాషే ఇన్సూరెన్స్‌‌ వంటివి ఎంతో అవసరమని ఫైనాన్షియల్‌‌ ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. ‘‘కరోనా బాధితుల్లో కొందరు ట్రీట్‌‌మెంట్‌‌ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో మిగతా వాళ్లు హెల్త్‌‌ పాలసీల కోసం ఎగబడ్డారు.   స్టాండెలోన్‌‌ కరోనా కవర్‌‌ తీసుకున్న వాళ్లూ ఉన్నారు. ఈ మహమ్మారి వల్ల బిజినెస్‌‌లు దెబ్బతిన్నాయి కాబట్టి వ్యాపారులు చాలా మంది ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌‌ కోసం అడుగుతున్నారు. ఇలాంటి పాలసీలు కూడా బాగా పెరుగుతున్నాయి’’ అని బజాజ్ ఎలియాంజ్‌‌ జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌ ఎండీ, సీఈఓ తపన్‌‌ సింఘెల్‌‌ అన్నారు.

కరోనా తరువాత డిమాండ్‌‌ పెరిగిన పాలసీలు ఇవి:

హోమ్‌‌ ఇన్సూరెన్స్‌‌

మనదేశంలో ఏటా భూకంపాలు, వరదలు, తుపానుల వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుంది. భూకంపాలు, కొండచరియలు కూలడం వంటి ప్రమాదాలు ఎక్కువ ఉండే ప్రాంతాలవాసులు హోమ్‌‌ ఇన్సూరెన్స్‌‌ తీసుకుంటే బెటర్‌‌. హఠాత్తుగా వచ్చే విపత్తుల్లో నష్టపోతే ఇవి ఎంతో ఆదుకుంటాయి. 

సాషే ఇన్సూరెన్స్‌‌

కొన్ని రకాల వ్యాధులు, ఇబ్బందుల కోసం సాషే ఇన్సూరెన్స్‌‌ తీసుకుంటారు. ట్రీట్‌‌మెంట్‌‌కు చాలా ఖర్చయ్యే వ్యాధుల కోసం ఇలాంటి ఇన్సూరెన్స్‌‌ ప్రొడక్టులను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇవి షార్ట్‌‌టర్మ్‌‌ పాలసీలు కాబట్టి ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. మొదటిసారి ఇన్సూరెన్స్‌‌ తీసుకునేవాళ్లు సాషే ఇన్సూరెన్స్‌‌లు తీసుకోవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. కాస్త డబ్బు ఎక్కువైనా ఫర్వాలేదనుకుంటే, పూర్తిస్థాయి హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ తీసుకోవడం ఇంకా బెటరని అంటున్నారు.

సైబర్‌‌ ఇన్సూరెన్స్‌‌

వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌తోపాటు ఆన్‌‌లైన్‌‌ పేమెంట్స్‌‌, షాపింగ్‌‌ పెరగడం వల్ల సైబర్‌‌ మోసాలు ఎక్కువయ్యాయి. కొన్ని కార్పొరేట్‌‌ సంస్థల నెట్‌‌వర్కుల్లోకి హ్యాకర్లు చొరబడి నష్టం తెచ్చిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి నష్టాల నుంచి రక్షణ పొందడానికి ఇప్పుడు చాలా మంది సైబర్ ఇన్సూరెన్స్‌‌ గురించి ఆలోచిస్తున్నారు. ఐడెంటిటీ థెఫ్ట్‌‌, మాల్వేర్‌‌ అటాక్‌‌, సైబర్ స్టేకింగ్‌‌ వల్ల డబ్బు నష్టపోతామని అని సింఘెల్‌‌ చెప్పారు.

యూసేజ్‌‌ బేస్డ్‌‌ ప్రొడక్టులు

ఒక బైకు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగే వరకు బీమా తీసుకుంటే దానిని యూసేజ్డ్‌‌ బేస్డ్‌‌ ఇన్సూరెన్స్‌‌ అంటారు. సింపుల్‌‌గా చెప్పాలంటే వాడినంత వరకే ఇన్సూరెన్స్‌‌ అన్నమాట! ‘‘కరోనా వస్తుందనే భయంతో చాలా మంది గవర్నమెంటు బస్సులకు బదులు సొంత వెహికల్సే వాడుతున్నారు. ఇలాంటి వాళ్లు యూసేజ్డ్‌‌ బేస్డ్‌‌ ఇన్సూరెన్స్‌‌ ప్రొడక్టులపై ఆసక్తి చూపుతున్నారు’’ అని సింఘెల్‌‌ అన్నారు.

Tagged corona, POLICY

Latest Videos

Subscribe Now

More News