ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎండాకాలంలో స్పెషల్ గా దొరికే ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని శరీరాన్ని చల్లబరుస్తాయి. మరికొన్ని ఈ కాలంలో వచ్చే పలు వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇంకొన్ని పోషకాలు అందిస్తాయి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. అందుకే, సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి.
వేసవి తాపాన్ని తట్టుకుని, కాస్త కూల్ గా ఉండాలంటే.. ఈ కాలంలో వచ్చే వడదెబ్బ, చికెన్ ఫాక్స్, విరేచనాలు.. లాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే. నీరసం రాకుండా, తక్షణమే శక్తి పొందాలంటే. ఎండాకాలంలో దొరికే అన్ని రకాల పండు తినాల్సిందే. అయితే, వాటిలో ఏ ఏ రకాల ప్రొటీన్స్ ఉన్నాయి ? ఏ ఏ వ్యాధులు రాకుండా కాపాడతాయి? అసలు ఎండాకాలంలో దొరికే ఫ్రూట్స్ ఎంటి ? ఎలా తినాలి ?
సపోటా
ఈ కాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో సపోటా కూడా ఒకటి. గ్రామాల్లోనే కాదు. సిటీ నగరాల్లో కూడా బండ్ల మీద కుప్పలుగా పోసి కిలోల లెక్కన అమ్ముతుంటారు. అయితే, ఇవి కొనేటప్పుడు పచ్చివా, పండువా చూసి కోవాలి. బాగా పండినవైతే వెంటనే కుళ్లిపోతాయి అలాగని ఎక్కువ పచ్చిగా ఉంటే ఇంట్లో పండకపోవచ్చు. అందువల్ల పండటానికి సిద్ధంగా ఉన్నవి తెచ్చుకోవాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్దకం సమస్య ఉన్నవాళ్లు వీటిని తినడం మంచిది, అతిసారం, రక్త స్రావం రాకుండా సపోటా చూస్తుంది, పేగులో ఉండే క్యాన్సర్ కారక పదార్థాలను తొలగిస్తుంది. సపోటాలోని విటమిన్ సి కంటిచూపును కాపాడుతుంది. విటమిన్ సీ ఫ్రీరాడికల్స్ తొలగిస్తుంది. రాగి, ఇనుము, పొటాషియం, పోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాలు జీర్ణవ్యవస్థ సదిగా జరిగేందుకు సాయపడతాయి. దీనిలో నీటీ శాతం ఎక్కువ. వేసవి తాపాన్ని తీర్చి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఎందుకంటే వీటిలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. పైగా తేలికైన ఆహారం కూడా.
ద్రాక్ష
ద్రాక్షల్లో అనేక రకాలు ఉన్నాయి. మన దగ్గర నలుపు తెలుపు ద్రాక్ష ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో కూడా నీటిశాతం ఎక్కువ. కార్బొహైడ్రేట్స్, క్యాల్షియం పాస్పరస్, విటమిన్ ఏ, సీ, బీకాంప్లెక్స్ లు ఉన్నాయి. అందుకే వీటిని నేరుగా తింటారు. జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. ఆనారోగ్యంతో ఉన్నవాళ్లకు ద్రాక్ష జ్యూస్ తక్షణ శక్తినిస్తుంది. ఇవి తినడం వల్ల మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. కిడ్నీల్ లో రాళ్లు రాకుండా నివారిస్తాయి. క్యాన్సర్ నిరోధక కారకంగా పనిచేస్తాయి. శరీరంలో పెరిగే చెడుకొవ్వును తగ్గిస్తాయి. నోరు, గొంతు ఇన్ఫెక్షన్ల పై పోరాడతాయి. అన్నింటికంటే శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరిగేందుకు ద్రాక్షపండ్లు తోడ్పడతాయి. అజీర్తితో బాధపడే వాళ్లు ద్రాక్షపండ్లు తింటే మంచిది. అలాగే మైగ్రెయిన్ తో ఇబ్బందిపడేవాళ్లు రోజూ ద్రాక్షరసం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ద్రాక్ష తినడం వల్ల చిగుళ్లు. పళ్లకు మేలు. ఊపిరితిత్తులు, గుండెకు మంచిది. ఐస్ క్రీమ్ లు , కేక్ ల తయారీలోనూ ప్రత్యేకంగా వీటిని వాడతారు. సౌందర్య సాధనాల్లో భాగంగా, శరీరకాంతిని పెంచడానికి ద్రాక్షను ఉపయోగిస్తారు.
రేగిపండ్లు
ఇప్పటికీ రేగిపండ్లు వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయి. వీటిలో కూడా చాలా రకాలున్నాయి. వీటిని నేరుగా కాకుండా. ఉప్పుకారం పొడితో కలిపి తింటారు. విత్తనం ఎక్కువగా, గుజ్జు తక్కువగా ఉన్నా వీటిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే అనేక రోగాల నుంచి రేగిపండ్లు కాపాడతాయి. వీటిలో ఉండే అనేక ఆమ్లాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వల్ల తరచూ వచ్చే జ్వరం, జలుబు లాంటివి తగ్గుముకం పడతాయి. ఇవి లివర్ పనితీరును, జీర్ణశక్తినీ మెరుగుపరుస్తాయి. వీటిలో కార్బో హైడ్రేట్స్ చక్కెర, పీచుపదార్థాం, ప్రొటీన్లు, క్యాల్షియం, ఇనుము. పాస్ఫరస్ ఉంటాయి. ఇవి తినడం వల్ల గొంతుకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. వీటి గింజలను పొడిచేసి. నూనెలో కలుపుకుని రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి
పుచ్చకాయ
వేసవి తాపం నుంచి బయటపడటానికి ఎక్కువ మంది పుచ్చకాయ తింటారు. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో అలసిపోయినప్పుడు పుచ్చకాయ తినడం వల్ల.. దీనిలో ఉండే సుక్రోజ్ గ్లూకోజ్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దాంతో వెంటనే ఓపిక వస్తుంది. పుచ్చకాయ గొంతు తడారిపోకుండా చేస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో విటమిన్ ఎ. బీ6, సి పిడి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం శాతం కూడా ఎక్కువే. కార్బొహైడ్రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. పుచ్చకాయ కడుపులో మంటను తగ్గించడమే. కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ జరగడానికి తోడ్పడుతుంది. వేసవిలోనే కాదు. మామూలు రోజుల్లో కూడా చర్మాన్ని రక్షించడానికి దీని గుజ్జు ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తినడం వల్ల ఆస్తమా జలుబు, అజీర్తి లాంటి రోగాలు తగ్గుతాయి. పుచ్చగింజలను రసంగా తీసుకుంటే బీపీ, మూత్ర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మామిడి
వేసవికాలంలో ఎక్కువగా దొరికే పండు మామిడి. ఇవి పండటానికి సిద్ధంగా ఉన్నప్పుడే కోసి పండటం కోసం వరిగడ్డిలో ఉంచుతారు. దీనిలో ఏ.బీ. సీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, చక్కెర, పీచుపదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, థయామిన్, సియాసిన్ లాంటి ఆమ్లాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే మామిడి తప్పకుండా తినాలనేది అందరిమాట. అయితే మామిడికాయ తిన్న తర్వాత అరగకపోతే చిటికెడు బియ్యం తింటే తేలిగ్గా జీర్ణం అవుతుంది.
సీమ చింతకాయలు.. ఎన్ని ఉపయోగాలో..
ఎండాకాలంలో దొరికే సీమ చింతకాయలంటే చాలామంది. ఇష్టంగా తింటారు. వగరు, తీపి కలిసి రుచిగా ఉంటాయి. వీటిని గుబ్బకాయలు, పులిచింతకాయలని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పులి చింతకాయల్లో ప్రొటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తిన్నప్పుడు పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది.. వెంటనే అకలికాదు. అలాగే వీటిలో ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గర్భిణిలకు చాలా మంచిది. మలబద్ధకం తగ్గిస్తాయి. వణుకు, నరాల బలహీనత లాంటివి రాకుండా కాపాడుతాయి. ఈ కాయల్లో కాపర్ కూడా ఉంటుంది. కనుక తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సీమచింతకాయల్లో ఉండే పొటాషియం శరీరంలోని పీహెచ్ లేవల్స్ పెరగకుండా, తగ్గకుండా చేస్తుంది. గుండె కొట్టుకోవడం, మీజిల్ ఫంక్షన్ సరిగా జరగడానికి ఈ కాయలు ఉపయోగపడతాయి. ఈ కాయలో ప్యాట్ ఉండదు. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుతాయి. తినడం వల్ల బరువు పెరగరు. ఆహార నిపుణులు రోజూ కప్పులో నాలుగోవంతు తీసుకొవడం మంచిదని చెప్పున్నారు. అలా కుదరకపోయినా వేసవిలో దొరికే వీటిని తప్పకుండా తినడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది..

