
ఉదయం నిద్ర లేవడంతోనే వెన్ను నొప్పితో బాధ పడుతుంటారు చాలామంది. దానివల్ల ఎటూ కదల్లేని పరిస్థితి ఉంటుంది. సరైన పొజిషన్‌లో పడుకోకపోవడమో, పడక సరిగా లేకపోవడమో ఈ సమస్యకు కారణాలు. దీన్ని అలానే వదిలేస్తే ముందు ముందు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు పరిష్కారంగా ఈ ఆసనాలు సాయపడతాయి అంటోంది డాక్టర్. మన్‌కిరత్ కౌర్.
మార్జాలాసనం
ఈ ఆసనాన్ని పిల్లి భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడంవల్ల శరీరంలోని అన్ని కండరాలకు ఎక్సర్‌సైజ్ అవుతుంది. ఈ పోజ్‌లో ఉన్నప్పుడు అన్ని అవయవాల్లో శరీర బరువు బ్యాలెన్స్ అవుతుంది. నడుము, వీపు నొప్పులు కూడా పోతాయి. ఈ ఆసనాన్ని ఎలాచేయాలంటే.. మోకాళ్ల మీద కూర్చొని, చేతులు నేలపైపెట్టి పిల్లి పొజిషన్‌లోకి రావాలి. భుజాలు, వీపు పైకి లేపి తలను కిందికి వంచాలి. తరువాత మామూలు పొజిషన్‌లోకి వచ్చి తల పైకి ఎత్తి నడుము, పొత్తి కడుపు సాగేలా పైకి లేస్తూ ఫొటోలో చూపించినట్టు ఈ ఆసనం వేయాలి.
బాలాసనం
బాలాసనం చేయడం వల్ల తొడ కండరాలు, వెన్నెముక సాగినట్టు అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే... కాళ్లు వెనక్కి మడిచి తొడలపై కూర్చోవాలి. తరువాత కాళ్లను కొంచెం వెడల్పు చేసి శరీరాన్ని ముందుకు వంచాలి. చేతులు చాపి నేలకు ఆన్చాలి. నుదుటి భాగాన్ని నేలకు తాకించి గట్టిగా ఊపిరి పీల్చుతూ, వదులుతూ ఆసనం వేయాలి.
శరీరం బరువులో సగం వెన్నెముక పైనే పడుతుంది. దానివల్ల తొందరగా బలహీనమవుతుంది. అందుకే వాటిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా అప్పుడప్పుడు రిలాక్స్ కావాలి. వెన్నెముక ఆరోగ్యం కోసం కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. పరుపు సరిగా లేకపోవడం కూడా నడుమునొప్పికి కారణం కావచ్చు. స్ప్రింగ్ మ్యాట్రెస్, స్పాంజ్ మ్యాట్రెస్, కాటన్ మ్యాట్రెస్ అంటూ చాలారకాల మ్యాట్రెస్ వాడుతుంటారు. అందరికి అన్ని రకాల మ్యాట్రెస్‌లు సూట్ కావు. కాబట్టి, వాళ్ల కంఫర్ట్‌కు తగ్గ మ్యాట్రెస్ వాడటం బెటర్.