లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..

ముందే ఎత్తేస్తే డేంజర్
లాక్డౌన్ ఎత్తేయడానికి ఆరు అంశాలు: డబ్ల్యూహెచ్ ఓ

జెనీవా: లాక్డౌన్ ను ముందే ఎత్తేయడం అంత క్షేమం కాదని, దాని వల్లతీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) పేర్కొంది. శుక్రవారం డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్ లాక్డౌన్ సడలింపులపై మాట్లాడారు. కొన్ని దేశాలు లాక్
డౌన్ను ఎత్తేసేందుకు లేదా సడలింపులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, సరైన చర్యలు తీసుకోకుండా లాక్డౌన్ను ఎత్తేస్తే కరోనా వైరస్ మరింత
ప్రాణాంతకమవుతుందని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేసేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. లాక్డౌన్ను ఎత్తేయడానికి ఆరు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.

10% హెల్త్ వర్కర్లకు కరోనా
చాలా దేశాల్లో హెల్త్ వర్కర్లపై కరోనా పంజా విసురుతోందని డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ అన్నారు. కొన్ని దేశాల్లో మొత్తం కేసుల్లో 10 శాతం మంది
వాళ్లే ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. వాళ్లకు ముప్పు వచ్చిందంటే అందరికీ ముప్పు వచ్చినట్టేనని అన్నారు. చాలా మంది
డాక్టర్లు, నర్సులకు ఆస్పత్రుల్లో కాకుండా బయటి ప్రాంతాల్లోనే వైరస్ సోకుతున్నట్లు తేలిందన్నారు. చాలాదేశాల్లో సరైన ప్రొటెక్టివ్ సూట్లు, మాస్కులు లేకుండానే కరోనా పేషెంట్లకు హెల్త్ వర్కర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారని, అది కూడా వాళ్లు వైరస్ బారిన పడడానికి కారణమవుతోందని ఆవేదన చెందారు. కాబట్టి వివిధ దేశాలకు అవసరమైన మాస్కులు, గ్లోవ్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్, డయాగ్నస్టిక్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసేందుకు యునైటెడ్ నేషన్స్ సప్లై చెయిన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతినెలా 10 కోట్ల మాస్కులు, గ్లోవ్స్, 2.5 కోట్ల ఎన్95మాస్కులు, గౌన్లు, ఫేస్ షీల్డులు, 25 లక్షల టెస్ట్ కిట్లను వివిధ దేశాలకు ఇస్తామన్నారు.

లాక్డౌన్ ఎత్తేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1.వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చి ఉండాలి.
2.అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
3. లాంగ్టర్మ్ కేర్ ఫెసిలిటీస్ పై వైరస్ ప్రభావం తక్కువగా ఉండాలి.
4.స్కూళ్లు, ఆఫీసులు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలి.
5.వేరే దేశాల నుంచి వచ్చే వైరస్ కేసులను నిరోధించగలగాలి.
6.వైరస్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. లాక్ డౌన్ ఎత్తేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి.