కోవిన్‌లో స్లాట్ బుక్ కావట్లేదా? అయితే వీటిలో ట్రై చేయండి..

V6 Velugu Posted on May 05, 2021

  • సర్వర్ బిజీ వస్తున్న కోవిన్ యాప్
  • ప్రత్యామ్నాయంగా కొత్త సైట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన టెకీలు

గత కొన్ని రోజుల నుంచి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగానే నమోదవుతున్నాయి. వైరస్‌ను కంట్రోల్ చేయాలంటే మాస్క్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటి పవర్ పెరిగి కోవిడ్ భారీ నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో ప్రజలు వ్యాక్సిన్ల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. కానీ వ్యాక్సిన్ కొరతతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. వ్యాక్సిన్ వేసుకోవాలంటే కచ్చితంగా కోవిన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో స్లాట్ బుకింగ్ కోసం పబ్లిక్ పడే కష్టాలు అన్నీఇన్నీ కాదు. పైగా.. జనాలందరూ స్లాట్ బుకింగ్ కోసం ఎగపడేసరికి కోవిన్ సైట్ సర్వర్ కాస్తా బిజీ అయింది. దాంతో స్లాట్ బుకింగ్ ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొంతమంది టెకీలు, పరిశోధకులు మరికొన్ని యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటితో స్లాట్ బుకింగ్ మరియు వ్యాక్సిన్ కేంద్రాలను సులువుగా తెలుసుకోవచ్చు. ఏయే సైట్ల ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం.

CoWIN: వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక యాప్ ఇది. ఈ యాప్‌లో డైరెక్ట్‌గా గానీ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా గానీ లాగిన్ అయి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 

Findslot.in: కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని కనుగొనడంలో సహాయపడే మరో యాప్ ఇది. ఇది కోవిన్ ఓపెన్ APIని ఉపయోగిస్తుంది. కోవిన్ మాదిరిగానే ఈ వెబ్‌సైట్‌లో కూడా పిన్ కోడ్‌లను ఎంటర్ చేయడం ద్వారా వ్యాక్సిన్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. 

Getjab.in: వ్యాక్సిన్ లభ్యత మరియు స్లాట్ బుకింగ్ గురించి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. ఈ సైట్‌ను ISBకి చెందిన పూర్వ విద్యార్థులు తయారుచేశారు. ఈ సైట్‌లో రిజిష్టర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే స్లాట్ ఖాళీగా ఉంటుందో అప్పుడు మనకు మెయిల్ ద్వారా తెలియజేస్తుంది.
 
Under45.in: ఈ సైట్ ద్వారా 18-44 సంవత్సరాల మధ్య వయసున్న వారు వ్యాక్సిన్ కేంద్రాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సైట్ ద్వారా స్లాట్ లభ్యత వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ సైట్‌లో కేవలం రాష్ట్రం మరియు జిల్లా సమాచారం మాత్రమే ఇస్తే సరిపోతుంది. మరే ఇతర వ్యక్తిగత వివరాలు అవసరం లేవు.

WhatsApp MyGov Corona Helpdesk: మార్చి 2020లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వ్యాక్సిన్ లభ్యత మరియు వ్యాక్సిన్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో 9013151515 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్‌కు వినియోగదారులు హలో లేదా హయ్ అని వాట్సాప్ చేస్తే.. వ్యాక్సిన్ సంబంధిత సమాచారంతో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయడం ద్వారా వారికి దగ్గరగా ఉన్న వ్యాక్సిన్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు.

Tagged India, corona vaccine, coronavirus, cowin, vaccine slot, vaccine centers, findslot, getjab, under45

Latest Videos

Subscribe Now

More News