పాత టైర్లతో చెప్పులు చేస్తున్నరు

పాత టైర్లతో చెప్పులు చేస్తున్నరు

దివ్య సిజ్వాలి, పార్థ్​ పూరీ.. ఇద్దరి వయసు పదిహేడేండ్లలోపే. అయితేనేం సొంతంగా ఫుట్​ వేర్​ కంపెనీ నడుపుతున్నారు వీళ్లు. అమెరికా, సౌత్​ ఆఫ్రికా లాంటి దేశాలకి తమ ప్రొడక్ట్స్​ పంపుతున్నారు. ఇంకాస్త ఆశ్చర్యం  ఏంటంటే.. పాత టైర్లని రీసైక్లింగ్ చేసి చెప్పులు తయారుచేస్తున్నారు . ఆలోచనే పెట్టుబడిగా పెట్టి సక్సెస్​ అయిన ఢిల్లీకి చెందిన ఈ ఫ్రెండ్స్​ గురించి.. 

పాత టైర్లని కాల్చితే.. వాటినుంచి హానికారక కెమికల్స్​ రిలీజ్​ అవుతాయి. ఒకవేళ చెరువులు, సముద్రాల్లో పడేస్తే  మైక్రోప్లాస్టిక్​గా మారి నీరు కలుషితం అవుతుంది. అందుకే ‘ టైరాన్​’ చెప్పుల బ్రాండ్​ని తీసుకొచ్చాం అంటున్నారు ఈ ఫ్రెండ్స్​. ​

ఆ ఆలోచనే...
స్పెషల్ అకేషన్స్​కి బోలెడు షూలు, చెప్పులు ఉన్నాయట పార్థ్​కి. కానీ, మామూలుగా ఇంట్లో వేసుకోవడానికి మాత్రం ఎప్పుడూ బోరింగ్​ డిజైన్లేదొరికేవట. ఇదే విషయాన్ని తన బెస్ట్​ ఫ్రెండ్​ దివ్యకి చెప్పాడు పార్థ్. ఆ వెంటనే ఈ సమస్యకి సొల్యూషన్​ మనమే ఎందుకు చూపించకూడదు అంది దివ్య. మనలా క్యాజువల్​ ఫుట్​వేర్​లో​ వెరైటీ కోరుకునే వాళ్లకోసం చెప్పులు తయారు చేద్దామని చెప్పింది. ఆ ఐడియా పార్థ్​కి కూడా నచ్చడంతో .. ఇద్దరూ కలిసి గ్రౌండ్​ వర్క్​ మొదలుపెట్టారు. పరిసరాలకి తమ ప్రొడక్ట్స్ మేలు చేసేవై ఉండాలని టైర్లతో చెప్పుల బేస్​ తయారు చేయాలనుకున్నారు. అందుకే తమ కంపెనీ పేరుని కూడా ‘టైరాన్’​​​ అని పెట్టారు. ఆలోచన రాగానే.. దగ్గర్లోని డంప్​ యార్డ్స్​, పాత సామాన్ల షాపులకి వెళ్లి, టైర్లు కలెక్ట్​ చేశారు. వాటిని క్లీన్​ చేసి, వైర్లు, స్పైక్స్​ తీసేశారు. చెప్పుల తయారీకి పనికొచ్చే పార్ట్స్​ని కట్​ చేసి, చెప్పులు కుట్టేవాళ్లని వెతుక్కుంటూ వెళ్లారు. వాళ్లు అనుకున్న​ డిజైన్​ని వాళ్లకి వివరంగా చెప్పి, వాళ్ల సలహాల్ని తీసుకొని డిజైన్​ని ఫైనల్​ చేశారు. వాళ్లకి డిజైనింగ్​లో ఇన్​పుట్స్​ ఇచ్చిన చెప్పులు కుట్టేవాళ్లతోనే  టైరాన్​​ ప్రొడక్ట్స్​ కుట్టించి, పోయిన ఏడాది ఏప్రిల్​లో మార్కెట్​లోకి తీసుకొచ్చారు. పెట్టుబడి విషయానికొస్తే... వాళ్ల ఐడియాని దేశంలోని వివిధ కాంపిటీషన్స్​కి పంపించారు . వాటిలో గెలిచిన డబ్బుతోనే చెప్పుల తయారీకి కావాల్సిన సామాన్లు కొన్నారు. ఆ తర్వాత బల్విన్​ కౌర్​, గుర్మాన్​ సింగ్​ సాధు అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్​  వీళ్లకి తోడయ్యారు. 

సమస్యలొచ్చాయి.. 
 ప్రొడక్ట్స్​కి మంచి రీచ్​ వస్తుంది.. ఆర్డర్స్​ పెరుగుతున్నాయి. కానీ, ఒక పక్క స్కూల్​, మరో పక్క బిజినెస్​ని బ్యాలెన్స్​ చేయలేకపోయారు. అలాగని, రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకోలేదు. స్కూల్​కి వెళ్తూనే.. రోజుకి మూడు గంటలు బిజినెస్​ కోసం కేటాయించారు. ప్రస్తుతం  ‘టైరాన్. ఇన్​’ ​ వెబ్​సైట్​ ద్వారానే తమ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు వీళ్లు. ఒక్కో జత చెప్పుల ధర ఆరు వందల నుంచి పన్నెండొందల రూపాయల వరకు ఉంది. మన దగ్గరే కాదు ఇతర దేశాలకు కూడా బల్క్​ ఆర్డర్స్​ పంపిస్తున్నారు. త్వరలో ఆన్​లైన్​ సైట్స్​లో  ఈ చెప్పుల్ని అమ్ముతారట. 

అదే మా గోల్​ 
ప్రస్తుతం ఎనిమిది రకాల ఫుట్​వేర్​ డిజైన్లని అమ్ముతున్నారు వీళ్లు. చాలామంది కస్టమర్స్​ మరిన్ని స్టైల్స్​లో చెప్పులు కావాలని అడుగుతున్నారట. దాంతో దానిమీద వర్క్​ చేస్తున్నామని చెప్తున్నారు . ఇంకా కొత్త కొత్త మెటీరియల్స్​తో చెప్పులు తయారుచేసే ఆలోచనలో ఉన్నారట. ఇదంతా ఎలా మేనేజ్​ చేస్తున్నారని అడిగితే.. ‘‘కంపెనీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నలుగురం కలిసి మాట్లాడుకుంటాం. ఒకరి పనిలో మరొకరం  తలదూర్చం. ఎందుకంటే ఎవరికి కేటాయించిన పనిని వాళ్లు వందశాతం ఎఫర్ట్​ పెట్టి చేస్తారు. అందుకే ఇబ్బంది అనిపించట్లేదు” అంటోంది దివ్య.