
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మెలకువగా ఉండి.. దొంగతనాన్ని చూస్తూ.. దొంగలను రక్షించిన ఎన్నికల కాపలాదారు" అని ఎన్నికల కమిషన్‌ను అభివర్ణించారు. ఓట్ల దొంగతనం అంశంపై గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించిన ఒక రోజు తర్వాత మళ్లీ ఆయన ఈసీపై విరుచుకుపడ్డారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన తన ఎక్స్‌ఖాతాలో ‘‘ఉదయం 4 గంటలకు నిద్ర లేవండి.. 36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి.. తర్వాత మళ్లీ నిద్రపోండి.. ఓట్ల దొంగతనం ఇలా జరుగుతుంది!.. ఎన్నికల కాపలాదారుడు మేల్కొని, దొంగతనాన్ని చూస్తూ, దొంగలను రక్షించాడు”అంటూ పోస్ట్‌చేశారు.
ఈ పోస్ట్‌కు గురువారం తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ నుంచి తీసుకున్న 36 సెకన్ల క్లిప్‌ను యాడ్చేశారు. ఇందులో ఓటర్ల తొలగింపులపై "100 శాతం బుల్లెట్-ప్రూఫ్ ఆధారం" ఉందని ఆయన పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కర్నాటక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డేటా ఉదహరించారు.
2022 డిసెంబర్ 19న ఉదయం 4 గంటలకు ఎవరో ఓటర్ రోల్ నుంచి ఇద్దరు పేర్లను తొలగించడానికి ఫారమ్‌లను తెరిచి, పూర్తి చేసి, సబ్‌మిట్ చేశారని, అది 36 సెకన్లలో జరిగిందని చూపించారు. పక్షపాతంగా కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.
వయనాడ్‌లో రాహుల్, సోనియా పర్యటన
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ శుక్రవారం కేరళలోని వయనాడ్ జిల్లాకు చేరుకున్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారు వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. వారిద్దరూ శుక్రవారం ఉదయం 10 గంటలకు కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పడింజరతారకు వెళ్లారు.
అక్కడ వారు ఉదయం 10.40 గంటలకు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో దిగారు. వారికి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ఎంపీ షఫీ పరంబిల్, ఎమ్మెల్యే టి సిద్ధిక్, వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్డీ అప్పచన్ స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు పడింజరతారలోని హోటల్‌కు వెళ్లారు.