రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

 

  • రాష్ట్రంలో అసలు పంట నష్టమే లేదు
  • ఒక్కో సర్పంచ్​కు నాలుగైదులక్షలు పెండింగ్​ ఉన్నయ్​
  • ఆమాత్రానికే ఎవరూ ఆత్మహత్య చేసుకోరు: ఎమ్మెల్సీ పల్లా

 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక వాళ్లను ఉరికిచ్చి కొడ్తామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి హెచ్చరించారు. అసలు రాష్ట్రంలో పంట నష్టమే లేదన్నారు. సర్పంచ్​లకు నాలుగైదు లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నది వాస్తమేనని, ఆ మాత్రం వాటి కోసం ఏ సర్పంచ్ కూడా ఆత్మచేసుకోడని చెప్పారు. శనివారం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎల్పీలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గంగాధర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, తాత మధుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే కొందరు ఓర్వలేకపోతున్నారని, తెలంగాణతో సంబంధం లేని వ్యక్తులు, సంస్థలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై సర్వే చేసేందుకు రైతు స్వరాజ్య వేదిక వద్ద ఉన్న వ్యవస్థ ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు పంట నష్టమే కావట్లేదని, అయినా పంట నష్టపోతేనే రైతులు ఆత్మహత్య చేసుకోబోరన్నారు. ఏసీ రూముల్లో కూర్చొని ఇలాంటి రిపోర్టులు తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఆ సంస్థకు, వ్యక్తులకు దమ్ముంటే రైతుల పెట్టుబడి ఖర్చులు పెంచి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించాలని సవాల్‌‌‌‌‌‌‌‌ చేశారు. 2014లో 1,300 మంది ఆత్మహత్య చేసుకుంటే 2021లో 352 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు 300 శాతం తగ్గాయన్నారు.

కేంద్రం పైసలు ఇయ్యకనే సర్పంచ్​లకు ఆపినం

రైతు వేదికల నిర్మాణానికి ఉపాధి హామీతో పాటు వ్యవసాయ శాఖ నుంచి నిధులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కేంద్రం ఉపాధి హామీ నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీలకు బిల్లులు చెల్లించలేకపోయామని, అందుకే సర్పంచుల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకనే బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి తప్ప, అందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పేమీ లేదన్నారు. కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి నెలా పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

దశలవారీగా రుణమాఫీ చేస్తం

తెలంగాణలో రైతుల స్థితిగతులు బాగున్నాయని నీతి ఆయోగ్‌‌‌‌‌‌‌‌ చెప్పిందన్నారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు రైతుబంధు రూపంలో జమ చేశామన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన 95,399 మంది రైతు కుటుంబాలకు రూ.4,770 కోట్లు బీమా చెల్లించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంట విస్తీర్ణం, పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.  ఇప్పటికే రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేశామని, మిగతా మొత్తం దశలవారీగా మాఫీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ సాకులతో పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే వాళ్లలో 70% మందిని తగ్గించామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఇంప్లీడ్‌‌‌‌‌‌‌‌ అయితే కావొచ్చన్నారు. బీజేపీపై పోరాడుతున్నది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాత్రమేనని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.