
ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర.. ఇలా చాలా వస్తువులు కావాలి. ఇల్లు పూర్తయ్యాక ఏసీ, ఫ్యాన్లు ఎలాగూ ఉండాల్సిందే. అయితే ధృవాంగ్ కపుల్ నిర్మించే ఇళ్లకు ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే వీళ్లు ఇల్లు కట్టేది మట్టితో. మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇళ్లకు ఏసీ, ఫ్యాన్లు లాంటివి కూడా అవసరం లేదు.
పుణెకు చెందిన ధృవాంగ్, ప్రియాంక దంపతులు ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్స్. నెలకు లక్షల్లో జీతం. కానీ ఆ ఉద్యోగాలను వదిలి పల్లెల్లో మట్టి ఇళ్లు కడుతున్నారు. ఖర్చుతో కూడుకున్న కాంక్రీట్ ఇళ్లకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అందిస్తున్నారు. సిమెంట్, స్టీల్ వాడకుండా సున్నపు రాయి, మట్టితో ఇల్లు కట్టడం ఎలాగో గ్రామాల్లోని వర్కర్స్‌కు నేర్పిస్తున్నారు.
మట్టితో..
ఆర్కిటెక్చర్ చదువుతున్న రోజుల్లో ధృవాంగ్.. మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్లాడు. ఆ ఊళ్లో నీళ్లు లేవు. అలాంటి ప్రాంతంలో సిమెంట్‌తో ఇల్లు కట్టడం కుదిరే పని కాదు. కానీ ఆ ఊళ్లో ఉండే ఒకామె మాత్రం మట్టి, ఆవుపేడ, చెక్క, చేతికి వేసుకునే గాజులతో ఇల్లు కట్టుకుంది. అది చూసి కాంక్రీట్‌తో పనిలేకుండా సహజమైన ఇళ్లు కట్టే టెక్నాలజీపై వర్క్ చేశాడు ధృవాంగ్. మట్టి ఇళ్లను మోడర్న్‌గా డిజైన్ చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. తన భార్య ప్రియాంకతో కలిసి ‘బిల్డింగ్ ఇన్ మడ్’ అనే ఆర్కిటెక్ట్ కంపెనీ మొదలుపెట్టాడు. మోడర్న్ లుక్‌లో ఉండే మట్టి ఇల్లు కట్టిస్తున్నాడు.
ఏసీతో పనిలేదు
మట్టితో కట్టే ఇళ్లకు సిమెంట్, స్టీల్‌కు బదులు కలప, మట్టి లాంటివి వాడతారు. దీని వల్ల ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది. మట్టి ఇళ్ల నిర్మాణంలో సున్నపురాయితో చేసిన (కాల్చని) ఇటుకలను మాత్రమే వాడతారు. ఇంటి బరువు గోడల మీద పడకుండా చెక్క బీమ్‌లు వాడతారు. మామూలు ఇళ్ల నిర్మాణంలో ఉండే గోడల కన్నా ఈ మట్టి గోడలు మందంగా ఉంటాయి. మట్టితో కట్టడం వల్ల ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. బయట టెంపరేచర్ 40 డిగ్రీలు ఉంటే ఇంటి లోపల 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. బయట చలిగా ఉంటే లోపల వెచ్చగా ఉంటుంది. అందుకే ఈ ఇళ్లకు ఏసీలతో పనిలేదు.
ఎంతో స్టడీ చేసి..
ధృవాంగ్ కపుల్.. ఎకోఫ్రెండ్లీ ఇళ్లు కట్టడానికి కావల్సిన మెలకువలను ముంబైలోని మలక్ సింగ్ అనే ఆర్కిటెక్ట్ దగ్గర నేర్చుకున్నారు. మూడేండ్లు ఆయన దగ్గర పనిచేసి ఇంటి నిర్మాణంలో ప్రాంతం, నేల, కల్చర్‌కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకోఫ్రెండ్లీ ఇళ్ల ఐడియాలపై రీసెర్చ్ చేశారు. ఇంటి డిజైన్, మెటీరియల్‌ను బట్టి అందులో ఉండే వారి లైఫ్‌స్టైల్ ఎలా మారుతుందో స్టడీ చేశారు.
ఎవరి ఇల్లు వాళ్లే కట్టుకోవచ్చు
“మట్టితో ఇల్లు కట్టడం అనేది ఒక సక్సెస్‌ఫుల్ మోడల్. ఈజిప్ట్ ఆర్కిటెక్చర్ అంతా మట్టితో నిర్మించిందే. పర్యావరణానికి మేలు చేసే ఈ మట్టి ఆర్కిటెక్చర్ గురించి ఈ జనరేషన్ వాళ్లకు అంతగా తెలియదు. ఎంతో కష్టపడి సున్నపురాయి నుంచి సిమెంట్ తయారుచేస్తున్నారు. కానీ సున్నపురాయితో కూడా ఇల్లు కట్టొచ్చన్న సంగతిని మర్చిపోయారు. మట్టితో చేసే ఇళ్లు అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటాయి. ఇవి ఎకోఫ్రెండ్లీ, సస్టెయినబుల్ ఇళ్లు. అయితే మట్టితో ఇళ్లు కట్టే టెక్నిక్స్ ఇప్పటివాళ్లకు తెలియదు. అందుకే గ్రామాల్లోని వర్కర్స్‌కు ఆ టెక్నిక్స్ నేర్పిస్తూ వాళ్లకు పని కల్పిస్తున్నాం. ఈ రోజుల్లో గ్రామాల్లో ఇల్లు కట్టడానికి సిటీ నుంచి సిమెంట్, స్టీల్ లాంటివి తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ మట్టి ఇళ్ల కాన్సెప్ట్‌ను డెవలప్ చేయగలిగితే గ్రామాల్లో ఎవరి ఇల్లు వాళ్లే కట్టుకోవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో సిటీలో ఉండేవాళ్లకు కూడా మట్టి ఇంటిపై మోజు పెరగొచ్చు”అంటున్నారు ఈ జంట.
‘మంచి ఉద్యోగాన్ని వదిలి ఈ దారి ఎందుకు ఎంచుకున్నారు?’ అని చాలామంది అడిగారు. అయితే కంప్యూటర్‌లో ఇంటి డిజైన్‌ను గీయడం కంటే గ్రామాల్లో తిరుగుతూ, అక్కడి వాళ్లకు కొత్త విషయాలు నేర్పుతూ, దగ్గరుండి ఇల్లు కట్టించడం నాకెంతో నచ్చింది. ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. మట్టి ఇళ్ల ప్రత్యేకతను గుర్తించిన చాలామంది.. ‘సిటీకి దూరంగా మాకొక మంచి మట్టిల్లు కట్టివ్వ’మని అడుగుతున్నారు. ముందుముందు ఇలాంటి ఇళ్లకు కచ్చితంగా డిమాండ్ పెరుగుతుందని నాకనిపిస్తోంది” అంటున్నాడు ధృవాంగ్.