ధరణి లొసుగులతో అమ్మిన భూముల ఆక్రమణ

ధరణి లొసుగులతో అమ్మిన భూముల ఆక్రమణ
  • మంథని మండలం దుబ్బపల్లి వాసుల ఎత

పెద్దపల్లి, వెలుగు: వాళ్లంతా ముప్పై ఏండ్ల కింద ఓ ఆసామి దగ్గర జాగ కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నరు. అట్ల 50 ఇండ్లతో ఓ కాలనీ ఏర్పడింది. అప్పట్లో సాదాబైనామాలు రాయించుకున్నా.. తర్వాత రెగ్యులరైజ్​ చేయించుకోలేకపోయారు. కొన్నాళ్లకు ఆసామి చనిపోయాడు. కానీ అతని వారసుడు.. ఇండ్లు కట్టుకున్న నాలుగు ఎకరాల భూమిని తన పేరు మీదికి మార్చుకొని ఇంకొకరికి అమ్ముకున్నడు. ఇప్పుడు ఆ భూమి ధరణిలోకి ఎక్కడంతో కాలనీ మొత్తం ఖాళీ చేసి తమకు అప్పగించాలని హుకుం జారీ చేస్తుండు. మంథని మండలం దుబ్బపల్లికి చెందిన పేద కుటుంబాలు తమకు జరిగిన అన్యాయంపై ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. వారి బాధ తీర్తలేదు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లిలోని 2వ వార్డులో 50 కుటుంబాలు 30 ఏండ్లుగా ఉంటున్నాయి. 177 సర్వే నంబర్​లోని 9.4 ఎకరాల్లో ఇండ్ల జాగలను 1985 నుంచి 1990 వరకు తులా శేఖర్​రావు, చొక్కారావు, తిరుపతిరావు అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. వాటిలో ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. దశాబ్దాలుగా గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను, నల్లా పన్ను కడుతున్నరు. అప్పట్లో సాదాబైనాలు రాయించుకున్నా, రెగ్యులరైజ్ చేసుకోలేదు. సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేస్తామని అప్లికేషన్లు తీసుకున్న సర్కారు వాటిని పెండింగ్​పెట్టింది. ఈలోగా భూములు అమ్మిన ముగ్గురు ఆసాములు 2011 నాటికి చనిపోయారు. వీరికి మహేశ్వర్​రావు అనే ఒక వారసుడున్నాడు. ఆయన మూడేండ్ల కింద 2 వార్డులోని ఇండ్ల కింది జాగలో 4 ఎకరాలను బొట్ల ఆంజనేయులు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు న్యాయం కోసం తహసీల్దార్, కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారు. దీంతో 177 సర్వే నంబర్ల భూములు ధరణిలో మహేశ్వర్​రావు, ఆంజనేయుల పేర్ల మీదే ఎక్కడంతో బాధితుల కష్టాలు మరింత పెరిగాయి.

ధరణిలో లొసుగుల వల్లే..  
భూములు నానాటికి ఖరీదవుతుండడంతో వారసుల్లో ఆశలు పుడుతున్నాయి. ఇలాంటి వాళ్లకు ధరణిలోని లోపాలు సహకరిస్తున్నాయి. దుబ్బపల్లిలోని177 సర్వే నంబర్​లో 30, 40 ఏండ్ల క్రితం ఆసాములు గుంట రూ.500, రూ.వెయ్యికి అమ్ముకున్నారు. ఇప్పుడు గుంట రూ.5లక్షల వరకు పలుకుతోంది. సాదాబైనామాలను సర్కారు రెగ్యులరైజ్ చేయకముందే ధరణి తేవడం, అందులో అనుభవదారు కాలమ్ ఎత్తేయడంతో పాత ఓనర్ల పేర్లే కనిపిస్తున్నాయి. ఇండ్లు ఉన్న భూములకు సైతం కొత్త పాస్​బుక్​లు, రైతుబంధు వస్తున్నాయి. దుబ్బపల్లి భూముల విషయంలోనూ ఇదే జరగడంతో వారసుడు మహేశ్వర్​రావు, ఆయన నుంచి భూమి కొన్న ఆంజనేయులు తెరపైకి వచ్చారు. ఇప్పుడు కాలనీ మొత్తం భూమి తమదేనని, వెంటనే ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మర్యాదగా ఖాళీ చేయకపోతే జేసీబీలు తెచ్చి ఇండ్లు కూలగొట్టి మరీ భూమి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ధరణి వచ్చాక తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని ఆఫీసర్లు అంటుండడంతో ఇక్కడి పేదలు ఆగమవుతున్నారు.

సర్వే రిపోర్ట్​ కలెక్టర్​కు పంపినం
కలెక్టర్​ ఆర్డర్ ప్రకారం దుబ్బపల్లి సర్వే నంబర్ 177 భూములను సర్వే చేయించి రిపోర్ట్ కలెక్టర్​కు పంపించిన. బాధితులకు భరోసా కల్పించాం. రూల్స్ ప్రకారం న్యాయం జరిగేలా చూస్తాం. బాధితులు ఆందోళన చెందొద్దు, మమ్మల్ని సంప్రదిస్తే వివరిస్తాము.
- బండి ప్రకాశ్, తహసీల్దార్, మంథని

మా ఇండ్లు వదులుకోం..
దుబ్బపల్లిలోని సర్వే నంబర్​ 177లో మా తండ్రి కొమురయ్య 1985లో 6 గుంటల జాగ కొని సాదా బైనామా రాయించుకున్నడు. మా లెక్కనే ఇంకో 50 మంది జాగ కొని ఇండ్లు కట్టుకున్నరు. మేము ఇండ్లు కట్టుకొని దాదాపు 25 ఏండ్లు అయింది. పంచాయతీకి అన్ని రకాల పన్నులు కడుతున్నం. మాకు భూములు అమ్మిన ఆసాముల వారసుడు, మరికొందరు ఇప్పుడొచ్చి ఆ భూమి మాదే, ఖాళీ చేసి వెళ్లిపోవాలని అంటున్నరు. మా ఇండ్లను వదులుకునే ప్రసక్తే లేదు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అందరికి చెప్పినం, మాకు న్యాయం చేయాలే.
- ఇట్టవేన తిరుపతి, బాధితుడు, దుబ్బపల్లి