
ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ ఎంత బలమైందో తెలుసుకోవాలని అనుకుంది ఒక జంట. దానికి వాళ్లే ఒక పరీక్ష పెట్టుకున్నారు. అయితే, ఆ పరీక్షలో వాళ్ల ప్రేమ నెగ్గిందా? లేదా? ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ కుడ్లే, విక్టోరియా పుస్టోవిటోవ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి, ఇంకొకరు ఉండలేనంతగా లవ్ చేసుకున్నారు. అయితే, వాళ్ల ప్రేమ ఎంత బలమైందో చూపించాలనుకున్నారు. ఒకరిని విడిచి, ఇంకొకరు ఉండకూడదని డిసైడ్ అయ్యారు. దీనికోసం వాళ్లు ఒక డిఫరెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ రెండు చేతులకు కలిపి ఒక చైన్ (సంకెళ్లు) వేసుకున్నారు. విక్టోరియా ఎడమచేయికి, అలెగ్జాండర్ కుడిచేయికి కలిపి ఒక సంకెల వేసుకున్నారు. ముందు మూడు నెలలే అనుకున్నా, నాలుగు నెలలకు పైగా ఇలాగే ఉన్నారు. మొత్తం 123 రోజులు చైన్‌తోనే కలిసున్నారు. ఎక్కడికెళ్లినా ఒకరిచేయి ఒకరు పట్టుకునే వెళ్లారు. అయితే వాష్‌రూమ్‌కు వెళ్లాల్సివచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇబ్బందిపడ్డారు. మరి ఇన్ని రోజులు ఉన్నారు కదా.. వీళ్ల లవ్ చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారేమో! అక్కడే ఉంది ట్విస్ట్. ఇన్ని రోజులు కలిసుండటం వల్ల ఒకరిగురించి ఇంకొకరు బాగా తెలుసుకున్నారేమో. చైన్ అన్‌లాక్ చేసుకున్న తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు ఇద్దరూ తమ చైన్‌ను విడదీసి, బ్రేకప్ చెప్పుకున్నారు. 123 రోజులు చైన్‌తో ఉన్నప్పటికీ, అంతకుముందు వేరే జంట ఇలా క్రియేట్ చేసిన రికార్డ్‌ను వీళ్లు బ్రేక్ చేయలేకపోయారు.