బోండా, బజ్జీ, సమోసా... ఎప్పుడూ ఇవేనా? బోర్ కొడుతున్నాయి అంటున్నారా! అయితే ఈ క్రేజీ శ్నాక్స్ మీకోసమే. అవేంటంటే.. చికెన్ మెజెస్టిక్, ఫిష్ బాల్స్..ఈ కాంబినేషన్ వినడానికే భలే టేస్టీగా ఉంది కదా. మీ ఇంటికి వచ్చిన గెస్టులకు ఇవి పెడితే మిమ్మలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. మరింకెందుకు ఆలస్యం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చదివి, ప్రిపేర్ చేయడం మొదలుపెట్టండి..
చికెన్ మెజెస్టిక్ తయారీకి కావాల్సినవి
- బోన్‌లెస్ చికెన్ – పావు కిలో
- నూనె, ఉప్పు – సరిపడా
- మిరియాల పొడి – అర టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ముప్పావు టీస్పూన్
- మొక్కజొన్న పిండి
- పెరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు
- కోడిగుడ్డు – ఒకటి,
- వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి – ఐదు
- కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
- పసుపు, కారం, ధనియాల పొడి – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
చికెన్ మెజెస్టిక్ తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్డు వేసి కలిపి అరగంట పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి అందులో చికెన్ వేగించాలి.
మరో పాన్‌లో నూనె వేడి చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి ఒక్కోటిగా వేస్తూ వేగించాలి.
ఉప్పు, సోయాసాస్, వేగించిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు చల్లాక ఒక నిమిషం కలుపుతూ వేగిస్తే రెస్టారెంట్ స్టైల్లో ఉండే హైదరాబాదీ చికెన్ మెజెస్టిక్స్ రెడీ.
ఫిష్ బాల్స్ తయారీకి కావాల్సినవి
- చేప ముక్కలు – పావు కిలో
- నీళ్లు – ఒక కప్పు
- పసుపు – పావు టీస్పూన్
- ఉప్పు – సరిపడా
- అల్లం వెల్లుల్లి తరుగు,ఎండు మిర్చి తునకలు – ఒక్కో టీస్పూన్ చొప్పున
- ఉల్లిగడ్డ – ఒకటి
- మిరియాల పొడి – అర టీస్పూన్
- ఆలుగడ్డ – ఒకటి (ఉడికించి, మెదిపి)
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు
- బ్రెడ్ పొడి – సరిపడా
ఫిష్ బాల్స్ తయారీ విధానం
ఒక పాన్‌లో నీళ్లు పోసి, పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. అందులో చేప ముక్కలు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చేప ముక్కల్లో ఉన్న ముళ్లు తీసేయాలి.
మరో పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి తరుగు వేగించాలి. అందులో చేప ముక్కల్ని కూడా వేసి కలపాలి. అందులో ఎండు మిర్చి తునకలు, మిరియాల పొడి, అరటీస్పూన్ ఉప్పు, మెదిపిన ఆలుగడ్డ కలపాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి వేసి, నీళ్లు పోసి పేస్ట్‌లా కలపాలి.
చేప మిశ్రమాన్ని ఉండలు చేసి మొక్కజొన్న పిండిలో ముంచాలి. ఆ తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి రెడీ చేసి పెట్టిన ఫిష్ బాల్స్ వేగించాలి.
