మాములుగా దొంగలు చోరీకి పాల్పడ్డ స్థలంలో ఆనవాళ్లు వదలకుండా జాగ్రత్త పడతారు. అయినప్పటికీ సీసీటీవీ ఫుటేజీ ద్వారానో, ఫింగర్ ప్రింట్స్ కారణంగానో పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే.. ఒక దొంగ మాత్రం దొంగతనానికి వచ్చి.. దర్జాగా ఏసీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ.. వండుకొని తిని... పోలీసులకే సవాల్ విసిరి వెళ్ళాడు. ఏపీలోని బాపట్లలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బాపట్లలో జమ్ములపాలెంలో సయ్యద్ షాషా ఓ ప్రైవేట్ స్కూల్ లో పీఈటీ టీచర్ గా పని చేస్తున్నారు. ఇటీవలే కూతురి పెళ్లి జరిపించిన షాషా... వారం రోజుల క్రితం కూతురి ఇంటికి వెళ్ళాడు. బక్రీద్ పండగ కూడా కూతురి ఇంటి దగ్గరే జరుపుకోవాలని ప్లాన్ చేశాడు షాషా.
అయితే... ఇంతలోనే స్కూల్ ప్రిన్సిపాల్ అర్జెంటుగా రావాలంటూ ఫోన్ చేయడంతో షాషా తన కొడుకును తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూడగా తలుపు లోపలి వైపు లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి వెనుకవైపు వెళ్లి చూడగా తలుపు తెరిచి ఉంది. లోపలి వెళ్లి చూస్తే.. ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన షాషా పోలీసులకు సమాచారం అందించారు.
షాషా ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. దొంగతనానికి వచ్చిన దొంగ రెండు బెడ్ రూంలలో వస్తువులన్నిటిని ఇష్టమొచ్చినట్లు కింద పడేసి.. హాల్ కిచెన్ లలో సామాన్లు అటు ఇటు విసిరేసి, బీరువాలోని నగదు దొంగలించాడు. ఆ తర్వాత హాల్లోని ఒక గోడపై కొన్ని రాతలతో పోలీసులకు సవాల్ విసిరాడు దొంగ. అందులో.. ‘‘ఒక దొంగ ఉన్నాడు.. వాడి పేరు రజ్ రామ్.. మీరు నన్ను పట్టుకుంటారా?’’ అంటూ బూతులు రాసి సవాల్ విసిరాడు దొంగ.
అంతే కాకుండా సయ్యద్ పాషా ఎన్‌సీసీలో ఉన్నప్పుడు తీసుకున్న ఒక పాత ఫోటోపై పిచ్చి గీతలు గీసి... టెడ్డీ బేర్ బొమ్మపై కూడా రజ్ రామ్ అని తన పేరును రాశాడు దొంగ. అక్కడితో ఆగకుండా... ఫ్రిడ్జ్ తెరిచి.. పాలు, పెరుగు ప్యాకెట్లు బయటపడేశాడు. కిచెన్ లో ఉప్పు, కారం, చింతపండు, కలుపుకొని ఎదో ఒక వింత పదార్థం తయారు చేసుకొని తిన్నాడని, హాల్లో ఏసీ ఆన్ చేసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూసినట్లు ఆనవాళ్ళు దొరికాయని తెలిపారు పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లూస్ మరిన్ని ఆధారాలు సేకరిస్తోంది. దొంగ అంతసేపు ఇంట్లో ఉండి ఏసీ ఆన్ చేసుకొని టీవీ చూస్తున్నా కూడా చుట్టుపక్కలవాళ్ళు పట్టించుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
