ఫ్రెండ్ ప్రాణం కోసం లెటర్ పెట్టి.. పోలీస్ ఇంట్లో చోరీ

ఫ్రెండ్ ప్రాణం కోసం లెటర్ పెట్టి.. పోలీస్ ఇంట్లో చోరీ

భిండ్: పోలీసు ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి నగలు,  వస్తువులు ఎత్తుకెళ్లాడు ఆ దొంగ. కానీ పోతూ పోతూ ఓ అపాలజీ లెటర్ కూడా పెట్టిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ సిటీలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో పని చేసే ఏఎస్‌ఐ కమలేశ్ కటారే కుటుంబం భిండ్‌లో ఉంటోంది. అతడి భార్య, పిల్లలు ఆ ఇంట్లో ఉంటున్నారు. అయితే జూన్ 30న కమలేశ్ భార్య, అతడి పిల్లలు ఓ బంధువు ఇంట్లో పెండ్లి ఉంటే వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి ఇంటికి రాగా లోపలి గది తాళాలు పగలిపోయి ఉండడం గమనించారు. బీరువాలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులోని బంగారు నగలు, వెండి వస్తువులు లేవని కమలేశ్ భార్య గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది.
తప్పనిసరై దొంగతనం.. మళ్లీ ఇచ్చేస్తానంటూ లెటర్
పోలీసులు ఇళ్లంతా గాలించి, క్లూస్ సేకరిస్తుండగా దొంగ విడిచి వెళ్లిన ఓ లెటర్ కనిపించింది. ‘‘సారీ ఫ్రెండ్, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది. నేను ఈ పని చేయకపోతే నా ఫ్రెండ్ ప్రాణం పోతుంది. ఓ నిండు ప్రాణం కాపాడడానికి ఈ దొంగతనం చేశాను” అని అందులో రాసి ఉంది. అయితే భయం అక్కర్లేదని, డబ్బు రాగానే తిరిగి ఇచ్చేస్తానని ఆ దొంగ పేర్కొన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ పని కమలేశ్ బంధువులు లేదా బాగా తెలిసిన వాళ్లు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు.