మంచిదొంగ.. నెల రోజుల్లో తిరిగి ఇస్తానని దొంగతనం

మంచిదొంగ.. నెల రోజుల్లో తిరిగి ఇస్తానని దొంగతనం

తమిళనాడులోని ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన వాటిని నెల రోజుల్లో తిరిగి ఇస్తానని లేఖ రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన  తూత్తుకుడి జిల్లా మెంజ్ఞానపురం సాతాన్‌ కులం రోడ్డులో చోటుచేసుకుంది.  చిత్రాయ్‌ సెల్విన్‌ అతని భార్య ఇద్దరు రిటైర్డ్ టీచర్స్. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  ఇటీవల కొడుక్కి చెన్నైలో కూతురు పుట్టడంతో చూడడానికి గత నెల జూన్ 17వ తేదీన అక్కడికి వెళ్లారు. ఇంటి తాళం చెవిని సెల్వి అనే మహిళకు ఇచ్చి వెళ్లారు. అయితే మరుసటి రోజు ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లిన  సెల్వికి తలుపులు పగులగొట్టి ఉండడం కనిపించింది. దీంతో  చిత్రాయ్‌ సెల్విన్‌ కు సమాచారం ఇవ్వగా అతను పోలీసులను సంప్రదించాడు.   

రూ.60 వేలు, బీరువాలో ఒకటిన్నర పౌండ్ల బరువున్న రెండు జతల కమ్మలు పోయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సెల్విన్‌. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపటట్టారు. విచారణలో భాగంగా సెల్విన్‌ ఇంటిని పరిశీలించగా..  వారికి ఓ లెటర్ దొరికింది. ఇందులో  నన్ను క్షమించు, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు.. వైద్య ఖర్చుల కోసం అప్పు చేశాను.. నెల రోజుల్లో తి రిగి ఇస్తాను అని దొంగ ఆ లేఖలో తెలిపాడు.  

దొంగ కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.   కేరళలో కూడా గతేడాది ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  మూడేళ్ల చిన్నారి నుంచి బంగారు హారాన్ని దొంగిలించిన ఓ దొంగ దానిని అమ్మగా వచ్చిన డబ్బును క్షమాపణ లేఖతో సహా తిరిగి ఇచ్చాడు.  ఈ ఘటన పాలక్కాడ్ సమీపంలో చోటుచేసుకుంది.