నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంను ఎత్తుకెళ్లే యత్నం

నిజామాబాద్ జిల్లాలో  ఏటీఎంను ఎత్తుకెళ్లే యత్నం
  • గ్రామస్తులు అరవడంతో పారిపోయిన దొంగలు
  • నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్​లో ఘటన

నిజామాబాద్, వెలుగు : ఏటీఎంలోని డబ్బులు దోచుకుందామనుకున్న దొంగలకు.. ఎంతకీ మిషన్  ఓపెన్ కాలేదు. గ్యాస్ కట్టర్, గడ్డపారతో పగులగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా, ఓపెన్ కాకపోవడంతో ఏటీఎం మిషన్​నే ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. దీని కోసం ఏకంగా పంచాయతీ ట్రాక్టర్​ను ఏటీఎం సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. చివరికి గ్రామస్తులు గమనించి.. అరవడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్​లో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల టైమ్​లో అంక్సాపూర్​లోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలోకి ముసుగు వేసుకున్న ముగ్గురు దొంగలు ప్రవేశించారు.

ముందుగా గ్యాస్ కట్టర్​తో మిషన్​ను కట్ చేసి అందులో ఉన్న డబ్బులు బయటికి తీసేందుకు ప్రయత్నించారు. గడ్డపారతో కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే తెల్లవారుతుండటంతో జనం చూస్తే దొరికిపోతామని గ్రహించి ఏటీఎం మిషన్​నే ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశారు. ఏటీఎంకు వచ్చేటప్పుడు దార్లో పంచాయతీ ఆఫీస్ ముందు ట్రాక్టర్ గమనించారు. ట్రాక్టర్ ట్రాలీలో మిషన్ ఎత్తుకెళ్లి డబ్బులు పంచుకుందామనుకున్నారు. వెంటనే పంచాయతీ ఆఫీస్ వెళ్లి బ్యాటరీ సాయంతో ట్రాక్టర్ స్టార్ట్ చేసి ఏటీఎం దగ్గరకు తీసుకొచ్చారు. ఏటీఎం మిషన్ లేపి.. ట్రాలీలో పెడ్తున్న టైమ్​లో సౌండ్స్ వచ్చాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు లేచి అరవడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.