సెక్యూరిటీ ఏమైంది సారూ : కొత్త సెక్రటేరియట్ లో దొంగలు పడ్డారు 

సెక్యూరిటీ ఏమైంది సారూ : కొత్త సెక్రటేరియట్ లో దొంగలు పడ్డారు 

తెలంగాణ కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారు. విలువైన సామాన్లు ఎత్తుకెళుతున్నారు. ఎప్పటి నుంచి జరుగుతుందో ఏమో కానీ.. జూన్ 7వ తేదీ మాత్రం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సెక్రటేరియట్ లోని మీడియా పాయింట్ లో కరెంట్ వైర్లు, స్విచ్ బోర్డులు, ఎల్ఈడీ లైట్లు మాయం కావటంతో కలకలం రేపుతోంది.

వైర్లను ఎక్కడికక్కడ కత్తిరించి.. ఎత్తుకెళ్లారు దొంగలు. ప్రస్తుతం సచివాలయంలో కొన్ని విభాగాల్లో పనులు జరుగుతున్నాయి. వర్కర్లు వచ్చి వెళుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణ కంపెనీలు సిబ్బంది ఉదయం వచ్చి చూస్తే.. తమ సామాగ్రితోపాటు.. వైర్ బండిళ్లు, రాడ్లు, ఇతర సామాగ్రి మొత్తం కనిపించకపోవటంతో.. వాళ్లు భద్రతా సిబ్బందికి కంప్లయింట్ చేశారు. 

600 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన సచివాలయంలో.. 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా 600 మంది పోలీసులు, స్పెషల్ బెటాలియన్ కు చెందిన భద్రతా సిబ్బంది 24 గంటలూ కాపలా కాస్తుంది. లోపలికి వెళ్లే వారిని.. బయటకు వచ్చే వారిని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అలాంటి భద్రత ఉన్న కొత్త సెక్రటేరియట్ లో దొంగలు పడటం.. అది కూడా భద్రతా సిబ్బందికి తెలియకపోవటం విశేషం.

లేటెస్ట్ గా జరిగిన దొంగతనంలో పోయిన వస్తువుల విలువ 20 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇది కొత్తగా జరుగుతున్న తంతు కాదని.. కొన్నాళ్లుగా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయనేది ఇప్పుడు సెక్రటేరియట్ లో జరుగుతున్న టాక్.  ఇవన్నీ అక్కడా ఇక్కడ జరిగి ఉండొచ్చేమో కానీ.. ఇప్పుడు ఏకంగా మీడియా పాయింట్ లోని వైర్లు, లైట్లు ఎత్తుకెళ్లటం కలకలం రేపుతోంది.