
- సైఫాబాద్ పీఎస్ లో పార్కు సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు
- దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ల చెకింగ్
బషీర్ బాగ్, వెలుగు : అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లోని మ్యాన్ హోళ్ల మూతలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గన్ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది చూసి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద గన్ పార్క్ పరిసరాల్లో నిత్యం సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుంది. పోలీసులు కూడా రాత్రి వేళ గస్తీ కాస్తుంటారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వెళ్లే మార్గం కూడా మూసివేశారు. అయినా దొంగలు 30 కిలోలపైన బరువు ఉండే ఇనుప మ్యాన్ హోల్ 3 మూతలను ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి సైఫాబాద్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లను చెక్ చేస్తూ దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు.