తిరుమల క్యూ లైన్లలో దొంగలు పడటం ఏంటి గోవిందా..? ఇలా ఎప్పుడైనా జరిగిందా..?

తిరుమల క్యూ లైన్లలో దొంగలు పడటం ఏంటి గోవిందా..? ఇలా ఎప్పుడైనా జరిగిందా..?

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో దొంగలు రెచ్చిపోతున్నారు. స్వామి వారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులే టార్గెట్గా దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. మహిళా భక్తుల మెడలో ఉన్న మంగళ సూత్రాలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగలను తిరుపతి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా భక్తులే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

శ్రీవారి ఆలయ వెండివాకిలి, పీఏసీ-3 దగ్గర కొందరు మహిళా భక్తుల మంగళ సూత్రాలను ఈ దొంగలు కాజేశారు. రద్దీ, తోపులాటల సమయంలో భక్తుల దృష్టి మరల్చి చాకచక్యంగా ఈ ముఠా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఇద్దరు మహిళా భక్తుల ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దొంగలను ఆరెస్ట్ చేశారు. 87 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.

  • Beta
Beta feature