మెటబాలిజం స్లో కావడానికి కారణాలు ఏంటి?

మెటబాలిజం స్లో కావడానికి కారణాలు ఏంటి?

తిన్నది అరిగి శరీర భాగాలకు శక్తినిచ్చే ప్రక్రియే మెటబాలిజం. అయితే, బరువు విషయానికొస్తే... సన్నగా ఉన్నవాళ్లలో మెటబాలిజం వేగంగా జరుగుతుందని,  బరువు ఎక్కువ ఉన్నవాళ్లలో మెటబాలిజం నెమ్మదిగా జరుగుతుందని అనుకుంటారు చాలామంది. అయితే,  మెటబాలిజం స్లో కావడానికి కారణాలు ఏంటో చెప్తోంది న్యూట్రిషనిస్ట్ నిక్కీ సాగర్.

హెల్దీఫుడ్​ తింటూ, రోజూ వ్యాయామం చేస్తున్నా బరువు పెరుగుతారు కొందరు. అలాంటప్పుడు మెటబాలిజం సరిగా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  అవును.. మెటబాలిజం నెమ్మదిగా జరిగితే బరువు పెరుగుతారు. అప్పుడు ఫుడ్, ఎక్సర్​సైజ్ జాగ్రత్తలు తీసుకున్నా కూడా బరువు తగ్గడం కష్టమవుతుంది. 

మెటబాలిజం నెమ్మదిగా జరగడం వల్ల శరీరంలోని కణాలకు పోషకాలు అందవు. దాంతో  శరీరం దెబ్బతిన్న కణాలని రిపేర్​ చేసుకోలేదు. అప్పుడు చర్మం, వెంట్రుకలు పొడిబారతాయి. గోర్లు పెళుసుగా అవుతాయి. థైరాయిడ్ హార్మోన్ సరిపోను ఉత్పత్తి కాకున్నా మెటబాలిజం నెమ్మదిస్తుంది. దాంతో మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి మీద ప్రభావం పడుతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.    

హార్మోన్ల శాతం కూడా మెటబాలిజం రేటు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్లు తక్కువ ఉంటే మెటబాలిజం నెమ్మదిగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ చేరుతుంది. అంతేకాదు ఉన్నట్టుండి క్యాలరీలు తగ్గినా, పెరిగినా కూడా మెటబాలిజం స్లో అవుతుంది. 

మూడ్ స్వింగ్స్ వల్ల కొన్నిసార్లు మెటబాలిజం వేగంగా జరగదు. మెటబాలిజం నెమ్మదిగా జరిగే కొందరిలో యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే... ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న బ్యాలెన్స్​డ్ డైట్ తినాలి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఆకలి కూడా తగ్గుతుంది. రోజూ ఎక్సర్​సైజ్ చేయాలి. స్ట్రెంత్​ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తే బెటర్.