ఈ బామ్మ సూపర్ మోడల్

ఈ బామ్మ సూపర్ మోడల్

మోడలింగ్‌‌లో ఉండే అమ్మాయిలు ఎక్కువగా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు వాళ్లే అయ్యుంటారు. ముప్పై పైబడిన వాళ్లలో కొద్ది మంది మాత్రమే మోడలింగ్‌‌ రంగంలో కొనసాగుతారు. లేదా ఏ సినిమా, స్పోర్ట్‌‌ సెలబ్రిటీ అయితేనే వయసుతో సంబంధం లేకుండా మోడలింగ్‌‌ చేస్తుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం 96 ఏళ్ల వయసులో మోడలింగ్‌‌ చేస్తోంది. అలాగని ఈమె సీనియరేం కాదు. జస్ట్‌‌ మూడేళ్ల నుంచే మోడల్‌‌గా రాణిస్తోంది. మోడల్స్‌‌లో అందరికంటే ఎక్కువ వయసే అయినా చాలామందితో పోలిస్తే మోడలింగ్‌‌లో ఇంకా జూనియరే.

హాంకాంగ్‌‌కు చెందిన అలీస్‌‌ పాంగ్‌‌ వయసు 96. ఇప్పుడు అక్కడి ఫ్యాషన్‌‌ ప్రపంచంలో ఒక సెన్సేషన్‌‌. కారణం.. ఈ వయసులో కూడా ఆమె మోడలింగ్‌‌ చేయడమే. అయితే గతంలో ఆమె ఎప్పుడూ మోడలింగ్‌‌ చేసింది లేదు. మూడేళ్ల క్రితమే అనుకోకుండా మోడల్‌‌గా మారింది. దీనికి కారణం ఆమె మనవరాలు. అలీస్‌‌ ఇంత వయసొచ్చినా ఎప్పుడూ ఫ్యాషనబుల్‌‌గానే ఉంటుంది. అందంగా, నవ్వుతూ యాక్టివ్‌‌గా కనిపించే ఆమె వయసుతో సంబంధం లేకుండా లేటెస్ట్‌‌ ట్రెండీ డ్రెస్సులు వేసుకుంటుంది. దీంతో మరింత అందంగా కనిపించేది. అలీస్‌‌ను చూసినప్పుడల్లా ఆమె మనవరాలుకు ఒక మోడల్‌‌ను చూసినట్లే అనిపించేది. తనలో ఉన్న ఫ్యాషన్‌‌ సెన్స్‌‌ ఎంతగానో ఆకట్టుకునేది.

ఆన్‌‌లైన్‌‌ ప్రకటన చూసి  

అలైస్‌‌ను రోజూ గమనిస్తున్న మనవరాలికి మూడేళ్లక్రితం ఆన్‌‌లైన్‌‌లో చూసిన ఒక ప్రకటన ఉత్సాహాన్నిచ్చింది. 65 ఏళ్లు పైబడిన మోడల్‌‌ కావాలనేది ఆ యాడ్‌‌ సారాంశం. దీంతో అలైస్‌‌ ఫొటోల్ని ఏజెన్సీకి ఆన్‌‌లైన్‌‌లో పంపించింది. అప్పుడు ఆమె వయసు 93. ఆ ఫొటోలు చూసి ఇంప్రెస్‌‌ అయిన నిర్వాహకులు అలీస్‌‌ను ఫొటోషూట్‌‌కు పిలిచారు. మనవరాలి ప్రోత్సాహంతో అక్కడికెళ్లిన అలైస్‌‌ మొదటి షూట్‌‌లోనే మోడలింగ్‌‌ నిర్వాహకుల్ని ఆకట్టుకుంది. మోడలింగ్‌‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా, తనలో ఉన్న సహజమైన అందంతో, యాటిట్యూడ్‌‌తో అందరినీ ఆకట్టుకుంది. అప్పట్నుంచి ఇప్పటివరకు కెరీర్‌‌‌‌లో వెనుదిరిగి చూడలేదు. ప్రతి చోటా ప్రొఫెషనలిజమ్‌‌తో ఆకట్టుకుంటోంది.

ఆసియాలోనే సీనియర్‌‌‌‌

అలైస్‌‌ ఎంత బిజీగా మారిందంటే మూడేళ్లుగా ఈ రంగంలో పని చేస్తూనే ఉంది. బెస్ట్‌‌ సీనియర్‌‌‌‌ మోడల్‌‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆసియాలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన మోడల్‌‌గా నిలిచింది. ‘గుచ్చి, ఎల్లరీ, వాలెంటినో’ వంటి ఇంటర్నేషనల్‌‌ బ్రాండ్లకు మోడలింగ్‌‌ చేస్తోంది. ఆమె స్టిల్స్‌‌ చూస్తే ఈ వయసులో కూడా ఇంత స్టైలిష్‌‌గా ఉండొచ్చా అనిపిస్తుంది.

నో డైట్‌‌

మోడల్స్‌‌ అనగానే కచ్చితంగా డైట్‌‌ ఫాలో కావాలి. రెగ్యులర్‌‌‌‌గా ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి. ఫ్యాట్‌‌ ఫుడ్‌‌ తినకూడదు. కానీ, అలైస్‌‌ మాత్రం ఇలాంటి రూల్స్‌‌ అస్సలు పాటించదు. తన ‘జీన్స్‌‌’వల్లే ఇంత అందంగా ఉన్నానని చెప్పింది. అలీస్‌‌కంటే తక్కువ వయసులో నోయా కుదో, వాంగ్‌‌ దేషన్‌‌ (84ఏళ్లు) లు మోడలింగ్‌‌లో రాణిస్తున్నారు.