ఈ ప్రభుత్వం ఉండేది రెండు మూడు నెలలే : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఈ ప్రభుత్వం ఉండేది రెండు మూడు నెలలే : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • ఇల్లెందు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు: ‘‘బీఆర్ఎస్​లో మనమంతా ఎన్నో అవమానాలు పడినం. కొంతమంది ప్రజాప్రతినిధులు అధికార మదంతో చాలా ఇబ్బందులు పెడ్తున్నరు. ఇది ఎంతో కాలం సాగదు. ఈ ప్రభుత్వం మహా అయితే ఇంకో రెండు మూడు నెలలే ఉంటది. మాకు కూడా ఓపిక నశించింది. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటం’’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 2018 ఎన్నికల టైంలో కేసీఆర్​​ఉమ్మడి జిల్లాలోని అనేక వేదికలపై మాట్లాడారని, ఎన్నికలైన మరుక్షణం ప్రతి నియోజకవర్గానికి వచ్చి రెండు రోజులు ఉండి, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని, కానీ ఆ హామీ ఏమైందో మీకు తెలి యంది కాదని అన్నారు.

అడుగడుగునా అవమానాలు..

బీఆర్ఎస్​లో నాలుగేండ్లుగా తనకు, తన అనుచరులకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని పొంగులేటి అన్నారు. ఆనాడు వైసీపీ నుంచి ఎంపీ స్థానంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని, హంగ్​ ప్రభుత్వం వస్తదనే ఆలోచనతో టీఆర్​ఎస్​ నాయకులు తమను అప్రోచ్​ అయ్యారని చెప్పారు. చివరకు రెండున్నరేండ్ల తర్వాత టీఆర్ఎస్​ లో జాయిన్​ అయినా తానుగానీ, తన అనుచరులుగానీ ఎలాంటి పదవులు తీసుకోలేదని చెప్పారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్​ నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారని, కొందరి చెప్పుడు మాటలు విని సిట్టింగ్​ ఎంపీగా ఉన్న తనకు 2019 ఎన్నికల్లో టికెట్​ ఇవ్వలేదని అన్నారు. లోక్​సభ​ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా నామినేషన్​ వేయాలని అభిమానులంతా కోరినా పార్టీ నియమావళికి కట్టుబడి పోటీ చేయలేదని వివరించారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తాను ఆ పార్టీని టీఆర్ఎస్​లో విలీనం చేసి జాయిన్​ అయితే.. నాడు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్​ మాటలకు కట్టుబడి ఇతర పార్టీల వైపు చూడలేదన్నారు.

రాబోయే రోజుల్లో అన్ని ఊర్లూ తిరుగుతా..

బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు కాదన్నా, తనను జైల్లో పెట్టినా ప్రజల కోసమే పనిచేస్తానని పొంగులేటి అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్​ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్​ మాదిరిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండేందుకు రాబోయే రోజుల్లో అన్ని ఊర్లు తిరుగుతానన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులకు ఈ మీటింగ్​కు రావాలని ఉన్నా కొందరి కారణంగా (ఎమ్మెల్యే హరిప్రియను ఉద్దేశించి) ఇండ్లకే పరిమితమయ్యారని పొంగులేటి చెప్పారు. కానీ పొద్దుపోయిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుందన్నారు. తన అనుచరులెవరినైనా ఇబ్బందులు పెడితే ఇక సహించే ప్రసక్తే లేదన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు, అధికార మదమెక్కి ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటున్నవాళ్లు తమ వాళ్ల జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పొంగులేటి హెచ్చరించారు. ‘‘మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్ది గంటల్లోనే శీనన్న మీ వద్ద ప్రత్యక్షమవుతాడు. నడిరోడ్డుపై సత్యాగ్రహ దీక్ష చేస్తాడు. రాబోయే సంగ్రామంలో చివరి దాకా కలిసి పోరాడుదాం’అని అన్నారు. కార్యక్రమంలో మల్లిబాబు యాదవ్, తుళ్లూరు బ్రహ్మయ్య, మువ్వా విజయ్​బాబు, బోళ్ల సూర్యం, సూవర్నపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.