ఆల్​టైమ్​ హైకి క్రెడిట్​ కార్డు ఖర్చులు

ఆల్​టైమ్​ హైకి క్రెడిట్​ కార్డు ఖర్చులు

జనవరి చివరి నాటికి అవుట్​స్టాండింగ్​ రూ. 1.87 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి చివరినాటికి క్రెడిట్​ కార్డుల అవుట్​స్టాండింగ్​ 29.6 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్ల ఆల్​టైమ్​ హై మార్కును అందుకుంది. డిజిటైజేషన్​ జోరుతోపాటు, కొవిడ్​ తర్వాత కన్జూమర్ల కాన్ఫిడెన్స్​ పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు.  ఆర్​బీఐ డేటా ప్రకారం ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లోని 10 నెలల్లో క్రెడిట్​ కార్డుల అవుట్​స్టాండింగ్​20 శాతం పైనే పెరిగింది. జూన్​ 2022 లో అత్యధికంగా 30.7 శాతం అవుట్​స్టాండింగ్​ నమోదయింది. చాలా కేటగిరీలలో డిజిటైజేషన్​ జరగడంతో,  కస్టమర్లు క్రెడిట్​ కార్డుల ద్వారా తమ ఖర్చులను పెంచారని ఎస్​బీఐ కార్డ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ రామ మోహన్​ రావు అమర చెప్పారు. హెల్త్​, ఫిట్​నెస్​, ఎడ్యుకేషన్​, యుటిలిటీ బిల్లులు వంటి వాటితోపాటు ఇతర చెల్లింపులు కూడా ఈజీ కావడంతో కస్టమర్లు ఒకింత ఎక్కువగానే తమ ఖర్చులకు క్రెడిట్​ కార్డులను వాడుతున్నారని పేర్కొన్నారు.

క్రెడిట్​కార్డుల వినియోగం నెలవారీ ట్రెండ్స్​గురించి మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా నిలకడగా కార్డులతో ఖర్చు పెరుగుతోందన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో క్రెడిట్​ కార్డుల ద్వారా చేసిన ఖర్చు రూ. 1.28 లక్షల కోట్లని, అంతకు ముందు నెల అంటే డిసెంబర్​2022 లో ఇది రూ. 1.26 లక్షల కోట్లని రావు వెల్లడించారు. ఏడాది కాలానికి చూస్తే ఈ గ్రోత్​ 45 శాతం దాకా ఉందని చెప్పారు. గత 11 నెలల కాలంలో ప్రతి నెలా క్రెడిట్​ కార్డుల ద్వారా ఖర్చు రూ. 1 లక్ష కోట్ల మార్కుకు పైనే ఉందని పేర్కొన్నారు.  క్రెడిట్​ కార్డుల అవుట్​స్టాండింగ్​ఈ ఏడాది జనవరిలో 29.6 శాతం గ్రోత్​ కనబరిచిందని, అంతకు ముందు ఏడాది జనవరిలో ఇది 10 శాతమేనని ఆర్​బీఐ డేటా చెబుతోంది. 2022 జనవరి చివరినాటికి క్రెడిట్​ కార్డుల అవుట్​స్టాండింగ్​ మొత్తం రూ. 1,41,254 కోట్లని, ఈ ఏడాది జనవరి చివరి నాటికి అది రూ. 1,86,783 కోట్లకు పెరిగిందని డేటా పేర్కొంటోంది. కన్జూమర్లలో కాన్ఫిడెన్స్​ బాగా పెరిగిందని ఆర్​బీఐ తాజా సర్వే వెల్లడించింది.  సాధారణ ఎకనమిక్ సిట్యుయేషన్​తోపాఉట, హౌస్​హోల్డ్​ ఇన్​కమ్​ విషయంలోనూ కన్జూమర్ల  సెంటిమెంట్​ మెరుగైనట్లు పేర్కొంది. 2022 డిసెంబర్​ నెలలో మొత్తం క్రెడిట్​ కార్డుల ఖర్చులో 60 శాతం ఈ–కామర్స్​ కొనుగోళ్లేనని ఎస్​బీఐ కార్డ్​ ఎండీ రావు చెప్పారు.   హోలీ పండగతోపాటు, వచ్చేది సమ్మర్​ సీజన్​ కావడంతో ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. కరోనా టైములో గ్రోసరీలు కొనడానికి, యుటిలిటీ బిల్లులు కట్టడానికి మాత్రమే క్రెడిట్​ కార్డులను వాడారని, ఫ్యూయెల్​, ట్రావెల్​, ఎంటర్​టెయిన్​మెంట్​వంటి వాటిపై క్రెడిట్​ కార్డుల వినియోగం అప్పట్లో బాగా పడిపోయిందని ఆండ్రోమెడా వైస్​ చైర్మన్​ స్వామినాథన్ వివరించారు. 

దేశంలో 8.25 కోట్ల క్రెడిట్​ కార్డులు....

జనవరి 2023 చివరి నాటికి దేశంలో మొత్తం 8.25 కోట్ల క్రెడిట్​ కార్డులున్నాయి. హెచ్​చ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ కార్డ్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​లు క్రెడిట్​ కార్డుల జారీలో ముందుంటున్నాయి. మార్ట్​గేజ్​ లోన్స్​, బిజినెస్​ లోన్స్​ వంటి సెక్యూర్డ్ లోన్స్​ కంటే పర్సనల్​లోన్స్​ సెగ్మెంటే వేగంగా పెరుగుతోందని ఆండ్రోమెడా లోన్స్​ ఎగ్జిక్యూటివ్​ చైర్మన్​ వి స్వామినాథన్​ చెప్పారు. కొత్తగా ఉద్యోగాలలో చేరుతున్న ఫ్రెష్​ గ్రాడ్యుయేట్లకు ఆర్థికపరమైన అవగాహన ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. క్రెడిట్​ స్కోరును పెంచుకునేందుకు యాక్టివ్​గా వారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చాలా ఫిన్​టెక్​ కంపెనీలు ఆన్​లైన్​ బాట పట్టడంతోపాటు ఇన్ఫర్మేషన్​ను కూడా షేర్​ చేస్తుండటంతో...యువత ముందుగా అన్నీ  తెలుసుకునే క్రెడిట్​ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని స్వామినాథన్ వెల్లడించారు.