
- స్పీడందుకున్న గగన్ యాన్ పనులు
- రష్యాలో మనోళ్లు 10 మందికి శిక్షణ
- మాములుగైతే నాలుగేళ్లు ..మనోళ్లకు రెండేళ్లే
- ముగ్గురిని ఫైనల్ చేయనున్న ఇస్రో
- స్పేస్ మిషన్ , మెయింటెనెన్స్ పై శిక్షణ
మానవులను అంతరిక్షంలోకి పంపే (గగన్‌యాన్) మిషన్ పనులు స్పీడందుకున్నాయి. 2020 డిసెంబర్‌లో గగన్‌యాన్ ఫస్ట్ ఫుల్ టెస్టును ఆస్ట్రోనాట్లు లేకుండా ఇస్రో చేయబోతోంది. ఆ తర్వాత 2021 జులైలో మరో టెస్టు చేస్తుంది. అంతా కరెక్టుగా జరిగితే 2021 డిసెంబర్‌లో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో గగన్‌యాన్ టేకాఫ్ అవుతుంది. వాళ్లు అక్కడ ఏడు రోజులు ఉండి ప్రయోగాలు చేసి తిరిగొస్తారు. ఇది విజయవంతమైతే ఇండియా ‘స్పేస్ స్టేషన్’ ఏర్పాటుకు మార్గం మరింత సుగమమవుతుంది. మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు రష్యాలో శిక్షణ మొదలైంది. 10 మంది టెస్ట్ పైలట్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంపిక చేసి పంపింది. వీళ్లకు ట్రెయినింగ్ పూర్తయ్యాక ఫైనల్‌గా ముగ్గురిని ఎంపిక చేస్తారు. స్పేస్ సూట్స్‌ను డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని డిఫెన్స్ లేబొరేటరీ డీఈబీఈఎల్ డిజైన్ చేస్తోంది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ కోసం మాస్కోలో ఇస్రో ఓ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఏమేం ప్రయోగాలు చేస్తారు?
స్పేస్‌లోకి వెళ్లాక ఆస్ట్రోనాట్లు ప్రయోగాలు చేస్తారు. కాబట్టి వాటిపైనా వాళ్లకు శిక్షణ ఇస్తారు. ఆ ప్రయోగాలేంటో ఇస్రో ఇంకా చెప్పలేదు. అయితే మైక్రోగ్రావిటీ ప్రయోగాల కోసం ప్రపోజల్స్‌ను గతేడాది పిలిచింది. ఇక 10 పేలోడ్ రకాలను క్రూ మాడ్యూల్‌కు బయట, లోపల సెట్ చేయనున్నారు. వ్యోమగాములు వాళ్లతో పాటు కొన్ని లైఫ్ ఫామ్స్ (జీవజాలం)ను తమతో పాటు తీసుకెళ్లనున్నారు. స్పేస్ ప్రయాణం వాటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోనున్నారు. మనిషి వ్యర్థాలను ఎలా డిస్పోజ్ చేయాలో కూడా మెడికల్ ఎక్స్‌పరిమెంట్ చేస్తారు. ఎలాంటి డిఫెక్ట్ లేకుండా మెడిసిన్ తయారుచేసే ప్రయోగాలూ చేయనున్నారు. మైక్రోగ్రావిటీలో మంటలు గుండ్రంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే భూమిపై మంచి ఎఫెక్టివ్ ఇంజన్లు తయారు చేయొచ్చు. దీనిపైనా ప్రయోగాలు చేయనున్నారు.
స్పేస్‌క్రాఫ్ట్ పరిస్థితేంటి?
చాలా ఏళ్ల ఆటుపోటుల తర్వాత 2018లో ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఓకే అయింది. రూ.10 వేల కోట్లను 2018 డిసెంబర్‌లో సర్కారు కేటాయించింది. ఆ తర్వాత నెలకు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు నుంచే స్పేస్ ఫ్లైట్ ప్రయోగాలపై ఇస్రో దృష్టి పెట్టింది. 2007లో హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ డౌన్ స్కేల్ వెర్షన్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపింది. ఈ స్పేస్ క్యాప్సుల్ రికవరీ ప్రోగ్రామ్‌లో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ భూ వాతావరణం నుంచి బయటకెళ్లడం, అలా వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయడం, మళ్లీ భూ వాతావరణంలోకి తీసుకురావడం, థర్మల్ మేనేజ్‌మెంట్, సముద్రంలో పడిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ రికవరీ లాంటి ప్రయోగాలు చేసింది. 2014లో ఇలాంటి ప్రయోగమే మరొకటి చేసింది. క్రూ మాడ్యూల్ అట్మాస్ఫెరిక్ రీ ఎంట్రీ ఎక్స్‌పరిమెంట్ అని పేరు పెట్టింది. 2018లో స్పేస్ ఫ్లైట్ ఎమర్జెన్సీ టెస్ట్‌నూ చేసింది. గగన్‌యాన్‌కు జీఎస్‌ఎల్‌వీ ఎంకే3ని వాడనున్నారు. ఈ ‘ఫ్యాట్ బాయ్’ సుమారు 7,800 కిలోల గగన్‌యాన్‌ను మోసుకెళ్లబోతోంది. లో ఎర్త్ ఆర్బిట్‌లో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో మన ఆస్ట్రోనాట్లు ప్రయోగాలు చేయనున్నారు.
ఆస్ట్రోనాట్లకు ఏం ట్రెయినింగ్ ఇస్తరు?
అన్నింటికన్నా ముందు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఫిట్‌గా ఉండే మిలిటరీ సిబ్బందికి కూడా కఠినమైన శిక్షణ తీసుకుంటారు. ఎందుకంటే రాకెట్ పైకెళ్లేటప్పుడు, తిరిగి దిగేటప్పుడు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఆస్ట్రోనాట్లు స్పృహ కోల్పోయేంతలా పరిస్థితులు ఎదురవుతాయి. పైగా.. పైకెళ్తుండగా గురుత్వాకర్షణలో మార్పులొస్తాయి. శరీరంపై పట్టు కోల్పోతుంటారు. బరువు లేకుండా అయిపోతారు. ఇలా జరిగితే సాధారణ ఆస్ట్రోనాట్లు చేసే స్పేస్ ఇంజన్ పనులు ఆలస్యమవుతాయి. అందుకే వీటన్నింటినీ తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. అక్కడ మన ఆస్ట్రోనాట్లు ఉండేది ఏడు రోజులే కాబట్టి శరీరంలో అప్పటికప్పుడు మార్పులొచ్చే అవకాశం లేదు. గ్రావిటేషనల్ ఫోర్స్‌కు తగ్గట్టు బాడీని మార్చుకుంటే సరిపోతుంది. దానికోసం యూరీగగారిన్ సెంటర్లోని ఓ సెంట్రిఫ్యూజ్‌లో విపరీతంగా ఆస్ట్రోనాట్లను తిప్పి శిక్షణ ఇస్తారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్, నావిగేషన్, థర్మల్ కంట్రోల్, ఆర్బిటాల్ మెకానిక్స్, ఎర్త్ అబ్జర్వేషన్‌పైనా శిక్షణనిస్తారు. మామూలుగానైతే ఆస్ట్రోనాట్లకు నాలుగేళ్ల ట్రైనింగ్ ఉంటుంది. కానీ మనకు టైం తక్కువుంది కాబట్టి రెండేళ్లకు కుదించారు. స్పేస్‌వాక్, డాకింగ్ లాంటివి లేవు కాబట్టి వాటిపై ట్రైనింగ్ ఉండదు. గగన్‌యాన్ ముఖ్య ఉద్దేశం మన టెక్నాలజీని చూపించడం.