మొదట క్యాన్సిల్..చివరి నిమిషంలో ఒకే

మొదట క్యాన్సిల్..చివరి నిమిషంలో ఒకే

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​లోని బుద్ధవనం ప్రాజెక్టును ఇటీవల సాదాసీదాగా ఓపెనింగ్ చేయడం వెనుక పొలిటికల్​హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును పనులన్నీ పూర్తయ్యాకే  దేశ, విదేశాల్లోని ప్రముఖలను ఆహ్వానించి గ్రాండ్​గా ఓపెన్ చేయాలని అధికారులు మొదట అనుకున్నారు. తద్వారా వివిధ దేశాల దృష్టిని ఆకర్షించడంతోపాటు, నిధుల సమీకరణకు దోహద పడుతుందని భావించారు.  కానీ రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోయి ఆగమేఘాల మీద  అత్యంత సాదాసీదాగా బుద్ధవనాన్ని ప్రారంభించడంతో ప్రాజెక్టులో పాలుపంచుకున్నవాళ్లంతా తీవ్ర నిరాశచెందారు. 

పర్యాటక మంత్రి ప్రకటనతో జిల్లా మంత్రి అలక..

నిజానికి బుద్ధవనం ప్రాజెక్టును ఎవరితో  ఓపెనింగ్  చేయించాలనే దానిపై  ప్రభుత్వానికి క్లారిటీ లేదు. పీఎం లేదంటే సీఎం కాదంటే  కేంద్ర పర్యాటక మంత్రితోనైనా  ప్రారంభోత్సవం చేయించాలనే ఆలోచనలో ఆఫీసర్లు ఉన్నారు. కానీ అనూహ్యంగా ఈ నెల 14న బుద్ధవనం ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీనివాస్​గౌడ్ హైదరాబాద్​లో డేట్ అనౌన్స్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే తేదీ ప్రకటించినప్పటికీ నల్గొండ జిల్లా వ్యవహారాలు చూస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డికి మాటమాత్రంగానైనా చెప్పలేదు. తన పర్మిషన్ లేకుండా  డేట్ డిసైడ్ చేయడం, మరోమంత్రి ప్రకటించడంపై లోకల్​ మంత్రి అలకబూనారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఏ కార్యక్రమమైనా తనకు తెలిసే జరుగుతున్నప్పుడు బుద్ధవనం విషయంలో ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని మంత్రి  జగదీశ్​రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది.  ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్​వస్తున్నారని తెలిసినా బుద్ధవనం ఏర్పాట్ల విషయంలో జగదీశ్​ జోక్యం చేసుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న హాలియా సభ ఏర్పాట్లనే పర్యవేక్షించి, తన నిరసన తెలిపారు. కానీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం కావడంతో ప్రాజెక్టు అధికారులు ఓపెనింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు.

అడుగడుగునా గందరగోళం

మంత్రి శ్రీనివాస్​గౌడ్ ముహూర్తం ఫిక్స్ చేయగానే బుద్ధవనం ఓపెనింగ్ కార్యక్రమాన్ని అధికారులు స్పీడప్ చేశారు. శిలాఫలకాలు, బౌద్ధ గురువులకు వసతులు, అతిథులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి జగదీశ్​రెడ్డి అలకబూనిన విషయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలియడం, సాదాసీదాగా ఓపెనింగ్​ చేయడం కరెక్ట్​ కాదనే అభిప్రాయాలు వ్యక్తంకావడంతో యూటర్న్​ తీసుకున్నారు. బుద్ధవనం ఓపెనింగ్ ప్రోగాం క్యాన్సిల్​ చేసి కేవలం విజిట్ మాత్రమే పెట్టుకుందామని కేటీఆర్​స్థాయిలో డిసైడ్ చేశారు. ఆమేరకు టూర్​ షెడ్యూల్​ కూడా ఖరారు చేశారు. కానీ అప్పటికే అధికారులు బుద్ధవనం ఓపెనింగ్ పేరుతో దేశ, విదేశాల్లోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపారు.  కొందరు బౌద్ధ గురువులను రూ.25 లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్​లో తీసుకొచ్చా రు.  వారంతా సాగర్​లో మకాం పెట్టారు. ఈ విషయం తెలిసి  శనివారం ఉదయానికి మంత్రులు మళ్లీ నిర్ణయం మార్చుకున్నారు. హడావిడిగా రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చేతుల మీదుగా బుద్ధవనం ఓపెనింగ్ చేయించారు. కానీ శిలాఫలకంలో మాత్రం ఐటీ మంత్రి, కేటీఆర్ ఓపెనింగ్​ చేసినట్లు రాసేశారు. ఇక కేటీఆర్ తర్వాత మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి ఆ తర్వాత నాలుగో వరుసలో శ్రీనివాస్​గౌడ్ పేరు చేర్చారు. నిజానికి ప్రోగాం షెడ్యూల్ మారిపోగానే శిలాఫలకం తొలగించి, బుద్ధ జయంతి వేడుకల ఓపెనింగ్ అని మార్చారు. కానీ మరుసటి రోజు ఓపెనింగ్ అని చెప్పగానే అప్పటికప్పుడు  శిలాఫలకం తెప్పించి పెట్టారు. 

అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకోవడంలో ఫెయిల్

సుమారు రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫండ్స్ గాక, దేశ, విదేశాల నుంచి భారీగా నిధుల సమీకరణ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నిధుల సమీకరణ జరగాలంటే కేంద్ర పర్యాటక శాఖ దృష్టిని ఆకర్షించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులను ఈ ప్రోగ్రాంకు ఆహ్వానిస్తే మరింత మేలు జరిగేదని ఆఫీసర్లు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయిలో అదీ ముగ్గురు మంత్రులు కలిసి ఓపెనింగ్ చేయడం వల్ల అంతగా గుర్తింపు దక్కలేదని అంటున్నారు. తైవాన్, థాయిలాండ్, శ్రీలంక వంటి చిన్నచిన్న దేశాలే ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఐదు విభాగాల్లో వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. బౌద్ధ యూనివర్సిటీ, క్రాఫ్ట్స్, ఫుడ్​కోర్టుతోపాటు, ముఖ్యమైన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. వీటన్నింటికీ మున్ముందు కేంద్ర సహకారం అవసరం కాగా, కనీసం రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డిని కూడా ఓపెనింగ్​కు ఆహ్వానించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.