రేషన్.. పరేషాన్ డిసెంబరు 31 వరకు ఈకేవైసీ అవకాశం: ​ రాజర్షి షా

రేషన్.. పరేషాన్ డిసెంబరు 31 వరకు ఈకేవైసీ అవకాశం: ​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: జిల్లా ప్రజలు రేషన్​ కార్డుల విషయంలో  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్​ రాజర్షి షా శనివారం  ప్రకటించారు. ఈ కేవైసీ నమోదుకు డిసెంబరు 31 వరకు అవకాశం ఉందన్నారు. రేషన్​కార్డులోని సభ్యులందరూ తమ రేషన్ దుకాణాలకు వెళ్లి వేలిముద్రల ద్వారా కేవైసీ చేసుకోవచ్చని సూచించారు. ఒకవేళ వేలిముద్రలు పడనట్లయితే ఐరిస్ ద్వారా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

 కేవైసీ ఆధారంగా రేషన్​ కార్డు తొలగించడం,  కుటుంబ సభ్యులను తీసివేయడం జరగదని పేర్కొన్నారు. కేవైసీ పూర్తయిన తర్వాత గతంలో మాదిరిగానే రేషన్ కార్డులోని ఎవరైనా ఒక సభ్యుడు రేషన్ షాప్ వెళ్లి రేషన్ తీసుకోవచ్చన్నారు. జిల్లాలోని రేషన్ డీలర్స్ కూడా తమ దగ్గరకు వచ్చిన కార్డుదారులను మీ- సేవ కేంద్రానికి పంపకుండా ఈ కేవైసీ  పక్రియ రేషన్ షాపులోని ఈ- పాస్​యంత్రం ద్వారా పూర్తి చేయాలన్నారు. 

ఆధార్​ లింకు కోసం అవస్థలు

ఆధార్​ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకోవడం, బయోమెట్రిక్​ కోసం కూడా ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. దీంతో మెదక్​ పట్టణంలోని మీ-సేవ కేంద్రం వద్దకు ఉదయమే రెండు వందల మంది తరలివచ్చారు. దీంతో కార్యాలయం వద్ద చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు టోకెన్​ పద్దతిన బయోమెట్రిక్​, ఆధార్​కు లింకు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. చాలా మంది శనివారం చివరి తేదీ అని పెద్ద సంఖ్యలో రావడంతో కొద్దిగా తోపులాట జరిగింది. 

సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేషన్ దారులు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు లైన్ లో నిలబడితే సుమారు 20 నుంచి 30 మంది వినియోగదారులకు మాత్రమే ఈ కేవైసీ పూర్తవుతున్నాయి. మిగతావారు తిరిగి వెళ్లిపోతున్నారు. పేద ప్రజలు గ్రామాల్లో ఇల్లు వదిలి పిల్లా పాపలతో పట్టణాలకు చేరి మీసేవ కేంద్రాల వద్ద అవస్థలు పడుతున్నారు.