నడవడానికి బద్ధకం.. టైర్ల మంచం తయారుచేసుకుండు

నడవడానికి బద్ధకం.. టైర్ల మంచం తయారుచేసుకుండు

పొద్దున్నే లేవడం మొదలు.. మంచం దిగాలన్నా, పళ్లు తోమాలన్నా, ఆఫీసుకు వెళ్ళాలన్నా, పని చేయాలన్నా .. ఆఖరికి తిండి తినాలన్నా బద్ధకించే వాళ్ళు ఎక్కడో ఒకచోట కనిపిస్తుంటారు. అలాంటి వాడే జు జియాన్​ కియాంగ్​. చైనాలోని యునాన్​ నగరానికి దగ్గర్లోని ఒక పల్లెటూళ్లో ఉంటాడు. చిన్నప్పుడు పొద్దున్నే నిద్ర లేచి స్కూల్​కు పోవాలంటే తెగ బద్ధకించేవాడు. మంచం మీద నుంచి దిగకుండానే బడికెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించేవాడు. కానీ కుదర్లేదు. ఇదిగో ఇన్నేండ్లకు తన బద్ధకానికి చక్రాలు తొడిగాడు. టైర్ల మంచాన్ని తయారుచేశాడు. అంటే.. చెక్క మంచానికి నాలుగు టైర్లు పెట్టి, బ్యాటరీ సాయంతో కదిలేలా తయారుచేశాడు. ఎండ, వానలకు ఇబ్బంది పడకుండా, అవసరమైతే విచ్చుకునేలా ఆటోమెటిక్​ గుడారం కూడా పెట్టాడు. తల కింది భాగం కొంచెం పైకి వెళ్లేలా, దానికి ఆనుకొని కూర్చునే ఏర్పాటు కూడా చేశాడు. ఇది కేవలం మనిషి నడిచేంత స్పీడుతో మాత్రమే వెళ్తుంది. ఈ మంచంపై పడుకొని, పక్కన పెంపుడు కుక్కను కూర్చోపెట్టుకొని ఊరంతా తిరిగాడు జియాన్​. చెరువు దగ్గరకు వెళ్ళి మంచం మీద నుంచి దిగకుండానే గాలం వేసి చేపలు కూడా పట్టాడు. దీన్నంతటినీ వీడియో తీసి చైనా సోషల్​ మీడియా యాప్​ ‘డూయూయిన్​’లో పోస్ట్​ చేశాడు. చైనీస్​ సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్స్​లో వైరల్​ అయింది. ఈ వీడియోను ‘నౌ దిస్​ న్యూస్’ ట్వీట్​​ చేయడంతో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ​ ‘చిన్నప్పుడు నిద్ర లేచి, బెడ్​ దిగి స్కూలుకు వెళ్లడం బద్ధకంగా ఉండేది. అప్పుడే నాకు ఇలాంటి మంచం ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పటికి నా కల నెరవేరింద’ని చెప్పాడు జియాన్​.