మజ్లిస్​లో ఇంటి పోరు

మజ్లిస్​లో ఇంటి పోరు
  • ఈసారి వృద్ధ నేతలకు టికెట్​ఇవ్వొద్దంటున్న అక్బరుద్దీన్​
  • అనుభవజ్ఞుల సేవలను పార్టీకి వాడుకోవాలంటున్న అసద్​
  • మూడు సెగ్మెంట్లలో అభ్యర్థులపై కొనసాగుతున్న సస్పెన్స్

హైదరాబాద్,వెలుగు : మజ్లిస్​పార్టీలో ఇంటిపోరు తయారైంది. ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్​స్థానాల్లోనే కాకుండా మరికొన్ని చోట్ల పోటీ చేసి గెలవాలని ఆ పార్టీ భావిస్తుంది. మరోవైపు పార్టీ నేతల్లో కొత్తగా విభిన్న వాదనలు చర్చనీయాంశంగా మారాయి. మజ్లిస్​లో ఏకచత్రాధిపత్యమే నడుస్తుండగా ఈసారి మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తుంది. పార్టీ అధినేత అసదుద్దీన్​ఓవైసీ ఆదేశాలు పాటించే పరిస్థితి లేకుండా పోయింది. అధినేత సోదరుడు అక్బరుద్దీన్​ ఓవైసీ, మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరాలు పెంచుతున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

ఏకంగా అక్బరుద్దీన్​ఓవైసీ పార్టీలోని కొందరు అభ్యర్థులను మార్చాలని కోరుతుండగా, మరో ఎమ్మెల్యే తనకు కానీ తన కుమారుడికి కానీ టికెట్​ఇవ్వకపోతే ఇండిపెండెంట్​గా పోటీ చేస్తానంటూ సవాల్​చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా మజ్లిస్​లో ఇంటిపోరు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. దీంతో  ఈసారి పార్టీ నుంచి బరిలో సిట్టింగ్​లే ఉంటారా? లేదంటే కొత్త వారికి చాన్స్ ఇస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. పార్టీలో వర్గపోరుకు దారుస్సలాం కేంద్రంగా ఉంది. 

యువతకే ప్రాధాన్యమంటూ..​

 ఈసారి ఎన్నికల్లో యువత పోటీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అక్బరుద్దీన్​ఓవైసీ వాదిస్తున్నట్టు, కొన్ని స్థానాల్లో కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్​పురా, బహదూర్​పురా, నాంపల్లి, మలక్​పేట, కార్వాన్​సెగ్మెంట్ల నుంచి సిట్టింగ్​ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో నాంపల్లి ఎమ్మెల్యే మెరాజ్​హుస్సేన్ ను  మార్చి అక్కడి నుంచి మాజీ మేయర్​ మాజిద్​హుస్సేన్​ను పోటీకి దింపాలని, అలాగే మెరాజ్ ​హుస్సేన్​ను యాకుత్​పురా నుంచి పోటీ చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తుంది.  

యాకుత్​పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రికి ఈసారి టికెట్​ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన వయోభారంతో పోటీకి నిలుపవద్దనుకుంటున్నారు. చార్మినార్​నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్​అహ్మద్​ఖాన్​కు సైతం ఈసారి టికెట్​ఇవ్వకుండా అక్బరుద్దీన్​కుమారుడు నూరుద్దీన్ ను పోటీకి దింపాలని అక్బర్​ ఆలోచన చేస్తున్నారు. ఇలా మజ్లిస్ కు కీలకమైన 3 నియోజకవర్గాలపై  అభ్యర్థుల విషయంలో సస్పెన్స్​ కొనసాగుతుంది. 

ఇండిపెండెంట్​గా చేస్తానంటూ సవాల్​

చార్మినార్​, యాకుత్​పురా నుంచి వృద్ధ నేతలను కాకుండా యువ నేతలను పోటీకి నిలపాలని భావిస్తుండగా.. ఎమ్మెల్యేలు పాషాఖాద్రి, ముంతాజ్​ను పక్కనబెట్టాలని నిర్ణయించారు. చార్మినార్​ఎమ్మెల్యే ముంతాజ్​అహ్మద్​తనకు టికెట్ఇవ్వకపోతే తన కొడుకు ఇంతియాజ్​ఖాన్​ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు.  కాదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సవాల్​చేస్తున్నట్టు పార్టీలోని కొందరు నేతలు తెలిపారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా తనకైనా.. లేదా తన కొడుకుకైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఇలా ఎన్నడూ లేని విధంగా పార్టీలో విభిన్న వాదనలు వినిపిస్తుండగా పార్టీ అధినేత అసదుద్దీన్​ సతమతం అవుతున్నట్టు సమాచారం. యువతకు ప్రాధాన్యత ఇస్తూనే అనుభవజ్ఞులను కూడా పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. కానీ అక్బరుద్దీన్​ఏకంగా యువతకే పోటీ చేసే చాన్స్​ ఇవ్వాలని పట్టుబడుతుండగా పార్టీలో ఇంటిపోరు తీవ్రంగా ఉంది.