వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలిగ్రామం

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలిగ్రామం

కరోనావైరస్ దేశవ్యాప్తంగా పాకింది. ఏ రాష్ట్రంలో చూసినా.. కరోనా మరణాలే. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ప్రతి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. తమ ప్రజలను కాపాడుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ఓ గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. దాంతో ఆ గ్రామం దేశంలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామమైన వయాన్ ఈ ఘనతను సాధించింది. ఆ గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందిరికీ వ్యాక్సినేషన్ పూర్తయింది. వయాన్ ప్రాంతం రోడ్డు సదుపాయంలేక కొండప్రాంతంలో ఉండటంతో టీకాలు వేయడానికి వైద్యసిబ్బంది 18 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారని గవర్నర్ కార్యాలయం తెలిపింది.

‘జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలోని వయాన్ అనే గ్రామం దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా నిలిచింది. ఇక్కడ 18 ఏళ్లు పైబడిన జనాభా మొత్తానికి టీకాలు వేశారు’ అని జమ్మూ కాశ్మీర్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

‘గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదు. అందువల్ల ఈ గ్రామ ప్రజలు.. పట్టణ ప్రాంతాల ప్రజలు మాదిరిగా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన 362 మందికి వ్యాక్సినేషన్ జరిగింది’ అని బండిపోర చీఫ్ మెడికల్ ఆఫీసర్ బషీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.