ఈ వారం (ఏప్రిల్ 2 మరియు 3 తేదీలలో) ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లోకి కొత్త సినిమాలు రానున్నాయి. ఇటీవలే థియేటర్లలో వచ్చిన ఓ నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, సోషల్ మెసేజ్ వంటి విభిన్న జానర్లలో ఈ సినిమాలు వస్తుండటం ప్రత్యేకం. ఇప్పటికే మేకర్స్ నుంచి అధికారిక స్ట్రీమింగ్ డేట్స్ కూడా వచ్చేశాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమింగ్ అవ్వనున్నాయి? అనే వివరాలు చూసేద్దాం..
‘హే బలవంత్’ (Hey Balwanth):
సుహాస్ హీరోగా గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా ‘హే బలవంత్’. మంగళవారం మార్చి 31, 2026 నుండి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. జీ5 (ZEE5) లో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. సుహాస్ మార్క్ కామెడీ, తండ్రీకొడుకుల మధ్య సాగే సెంటిమెంట్ ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకోనుంది.
కథ:
రావు బలవంత్ (Naresh) తన కుటుంబానికి కూడా తెలియకుండా ఒక రహస్య వ్యాపారం నడుపుతుంటాడు. అతని కుమారుడు కృష్ణ (Suhas) ఆ బిజినెస్‌ను చేపట్టే సమయంలో, దాని వెనుక ఉన్న నిజం తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ బిజినెస్ కారణంగా అతని ప్రేమికురాలు మిత్ర (Shivani Nagaram) అతనిని వదిలి వెళుతుంది. మిత్ర తాత (Babu Mohan)కి కూడా ఆ వ్యాపారంతో సంబంధం ఉంటుంది. ఆ రహస్య బిజినెస్ ఏమిటి? చంప (స్రవంతి) ఎవరు? ఈ విషయం కృష్ణ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది సినిమా కథ.
‘మృత్యుంజయ్’(Mrithyunjay):
శ్రీవిష్ణు హీరోగా సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ మూవీ ‘మృత్యుంజయ్’(Mrithyunjay). మార్చి 6న విడుదలైన సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. హుస్సేన్ రైటింగ్, ట్విస్ట్‌లు బాగా వర్కవుట్ అయ్యాయి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్‌లో ఇదొకటి.
సినిమాలో పాటలు, కామెడీ సీన్లు ఉండవు. కేవలం కంటెంట్‌తోనే ఆడియెన్స్ను ఎంగేజ్ చేసింది. ఇపుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రానుంది. మైండ్ గేమ్ ఎలిమెంట్స్‌తో నడిచే థ్రిల్లర్ కథ కావడంతో ఓటీటీ ఆడియన్స్ కు పండుగనే చెప్పాలి.
మృత్యుంజయ్ కథ:
హైదరాబాద్‌లో ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో జయ్ (శ్రీ విష్ణు) ఉద్యోగం చేస్తాడు. ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ఇవ్వించడమే అతని పని. అయితే, ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటున్న అతను, ఒక వారం వ్యవధిలో అనుమానాస్పదంగా జరిగిన రెండు మరణాలపై సందేహం పెంచుకుంటాడు.
వాటిలో ఒకటి చిన్నారి అంజలి (ఊహా రెడ్డి) తండ్రి అచ్యుత్‌రావు (బాలాదిత్య) మరణం. అది సహజ మరణం కాదని.. హత్య చేయబడిందని జయ్ అనుమానించి, ఏసీపీ సీతగా (రెబా మౌనిక జాన్) దృష్టికి తీసుకెళ్తాడు. అయితే ఆమె అది ప్రమాదమని భావిస్తుంది. చివరికి జయ్ తన అనుమానాన్ని ఎలా నిరూపించాడు? ఆ హత్యల వెనక నిజం ఏమిటి? అనేదే సినిమా కథ.
‘యుఫోరియా’ (Euphoria):
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేసి, నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’ (Euphoria). ప్రస్తుత సమాజంలోని అత్యంత భయంకరమైన ‘డ్రగ్స్’ సంస్కృతిని ఇతివృత్తంగా తీసుకుని ‘యుఫోరియా’ (Euphoria)ను రూపొందించారు. 2026 ఫిబ్రవరి 6న సినిమా థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో సీనియర్ నటి భూమిక, ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ కీలక పాత్రల్లో కనిపించగా, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. సినిమా కథనం, స్క్రీన్ ప్లే ఆకట్టుకోవడంతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కథ:
ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి చైత్ర (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. డ్రగ్స్ మత్తులో తూగుతున్న ఒక యువకుడు ఆమెపై జరిపిన అఘాయిత్యం, ఆ అమ్మాయి ఆశయాలను చిన్నాభిన్నం చేస్తుంది.
చైత్ర ఈ విషయాన్ని తన పేరెంట్స్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.
అయితే, అత్యాచారం చేయడంలో భాగమైన ఐదుగురు కుర్రాళ్ల కథేంటీ? ఈ కేసులో తాను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) హైకోర్టుకు ఎందుకు వెళుతుంది? అసలు వింధ్య చేసిన తప్పు ఏంటి? ఇంతకీ వింధ్య ఎవరు? కమిషనర్ జయదేవ్ కేసుని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఐదుగురు కుర్రాళ్లకు ఎలాంటి శిక్ష పడింది? అనేది మిగతా కథ.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’:
90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ.. ఇటీవలే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’తో వచ్చారు. క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఈ మూవీని స్వయంగా శివాజీనే నిర్మించారు. మార్చి 6, 2026న మూవీ థియేటర్లోకి వచ్చింది.
సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90s వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించాడు. ప్రిన్స్, లయ, ఆలీ, రోషన్, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్లో డిసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమా ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. శుక్రవారం ఏప్రిల్ 3 నుంచి ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
కథ:
శ్రీరామ్ (Sivaji) నిజాయితీ గల పంచాయితీ సెక్రటరీగా తన ఫ్యామిలీతో సాదాసీదా జీవితం గడుపుతాడు. అతని భార్య ఉత్తర (Laya), కొడుకు బిట్టుతో కలిసి ప్రశాంతంగా ఉంటాడు. లోకల్ ఎస్సై విక్రమ్ (Prince Cecil) ఉత్తరపై కన్నేసి, ఒక రోజు ఇంటికి వెళ్లి అనూహ్యంగా హత్యకు గురవుతాడు. దీంతో శ్రీరామ్ కుటుంబం పెద్ద సమస్యలో పడుతుంది.
ఈ హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారు? కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ్ శవాన్ని దాచే ప్రయత్నంలో పడే ఇబ్బందులు, అలాగే కోటి రూపాయల బ్యాగ్ చుట్టూ జరిగే గందరగోళం కథను నడిపిస్తాయి. చివరికి ఈ క్రైమ్ నుంచి బయటపడతారా లేదా అనేదే కథలో సస్పెన్స్.
The Boundless Entertainment is now in cinemas ❤️🔥
— Sivaji (@ActorSivaji) March 8, 2026
This weekend, Book Your Tickets for Thrilling blockbuster #SampradayiniSuppiniSuddapoosani & enjoy the madness 🤩💥
Book Your Family Ticket Now
🎟️https://t.co/cMfHkDEr9A pic.twitter.com/rDo9fKEsK7
