ఈవీఎంలను రద్దు చేయాలి : తిరుమావళవన్

ఈవీఎంలను రద్దు చేయాలి : తిరుమావళవన్

చిదంబరం ఎంపీ తిరుమావళవన్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఈవీఎంలను రద్దు చేయాలని చిదంబరం ఎంపీ, వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమవళవన్ డిమాండ్ చేశారు. బ్యాలెట్​పేపర్​ఓటింగ్​ను తిరిగి తీసుకురావాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్య అతిథిగా తొల్ తిరుమవళవన్ హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పాలనతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయన్నారు.

బీజేపీ ఈవీఎంలను దుర్వినియోగం చేస్తోందని, కనీసం వీవీ ప్యాట్లను 100 శాతం లెక్కించాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈవీఎంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతామన్నారు.

సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని ఓడించేందుకు తెలంగాణలో వీసీకే పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్, జనరల్ సెక్రటరీ చెరిపల్లి ఆనంద్, ఏపీ అధ్యక్షుడు ఎన్.జె.విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.