సారుపైనే ఆశలు.. కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ మారుతుందంటున్న బీఆర్ఎస్ నేతలు

సారుపైనే ఆశలు..   కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్  మారుతుందంటున్న బీఆర్ఎస్ నేతలు
  • అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత 
  • అభివృద్ధి, స్కీమ్​ల​ అమలుపై నిలదీస్తున్న జనం
  • సీఎం సభలతో వ్యతిరేకత తగ్గుతుందన్న ధీమాలో లీడర్లు
  • 15 నుంచి గులాబీ బాస్ ప్రచారం షురూ.. 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో మీటింగ్స్​  

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ పైనే ఆ పార్టీ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీ అభ్యర్థులపై జనంలో వ్యతిరేకత ఉన్నా.. సార్ రంగంలోకి దిగితే సీన్ మారిపోతుందన్న ధీమాలో ఉన్నారు. సీఎం సభలతో పార్టీపై, అభ్యర్థులపై వ్యతిరేకత తగ్గుతుందని ఆశిస్తున్నారు. కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దించారు. అయితే అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. తమకు స్కీమ్​లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఎలక్షన్​ షెడ్యూల్​కు ముందే 60 నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించినా వ్యతిరేకతను పూర్తిస్థాయిలో అధిగమించలేకపోయారు. మూడు వారాలుగా వైరల్​ ఫీవర్, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడ్డ కేసీఆర్..​ ఈ నెల 15 నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు. తనకు సెంటిమెంట్​గా ఉన్న హుస్నాబాద్​ నియోజకవర్గ కేంద్రం నుంచే మూడోసారి ప్రచారం షురూ చేయనున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలనే లక్ష్యంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.

దసరా తర్వాతే కేసీఆర్​ పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగుతారని ప్రగతి భవన్​వర్గాలు లీకులిచ్చిన కొన్ని గంటల్లోనే.. 17 రోజుల పాటు ఆయన ప్రచారం చేయనున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దసరా సందర్భంగా కాస్త విరామం ఇచ్చి కేసీఆర్​సభల షెడ్యూల్ ​ఖరారు చేశారు. 17 రోజుల్లోనే 41 నియోజకవర్గాల్లో ​ప్రచారం చేసేలా షెడ్యూల్​ రూపొందించారు. కేసీఆర్ ​ప్రచారంలోకి రాబోతున్నారని మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. ‘త్వరలోనే పులి వస్తది.. సీన్​ మారిపోతుంది’ అని కేటీఆర్​ ఇటీవల అన్నారు.

ఈ నెల 15న తెలంగాణ భవన్​లో పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్న కేసీఆర్.. ​ఇదే మీటింగ్​లో పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ​ఆరు గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్​ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీశ్​ ఇప్పటికే ప్రకటించారు. దీంతో మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయనే దానిపై చర్చ మొదలైంది. 

మొదట వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లోనే సభలు.. 

రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో క్రమేణా వ్యతిరేకత పెరిగింది. అంతకుమించి ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. సిట్టింగ్​ఎమ్మెల్యేల్లో 90% మందికి టికెట్లు ఇవ్వడంతో వారిపై ఉన్న వ్యతిరేకత పార్టీపైనా ప్రభావం చూపుతుందని గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. దళితబంధు, గృహలక్ష్మీ, బీసీలకు ఆర్థిక సాయం స్కీమ్​లను అనర్హులకు ఇచ్చారని మంత్రులు, ఎమ్మెల్యేలను జనం ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పూర్తి కాకపోవడంతో రైతుల్లోనూ వ్యతిరేకత ఉంది.

ముదిరాజ్​ కులం నుంచి ఒక్కరికి కూడా టికెట్​ఇవ్వకపోవడం, మరికొన్ని బీసీ కులాలను విస్మరించడంపైనా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ​నేతలు హైరానా పడుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ఒక్క కేసీఆర్​తోనే సాధ్యమని వాళ్లు నమ్ముతున్నారు. నెల రోజులుగా ప్రజా క్షేత్రంలో ఉన్న కేటీఆర్, హరీశ్​రావు సైతం ‘సారు వస్తే సీన్​మారిపోతుంది’ అన్నట్టుగా చెబుతున్నారు. అందుకే కేసీఆర్​బహిరంగ సభల షెడ్యూల్​ను ముందుకు జరిపినట్టుగా తెలుస్తోంది.

పార్టీపై ఎక్కువ వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లోనే మొదట సభలు పెట్టేందుకు ప్లాన్ చేశారు. కేసీఆర్ ఇచ్చే​హామీలతో పాటు మళ్లీ బీఆర్ఎస్​ను ఎందుకు గెలిపించాలో ఆయన చెప్తే.. జనం కన్వీన్స్ అవుతారని, అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ‘సారు రంగంలోకి దిగితే​ ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గత ఎన్నికల మాదిరిగానే మళ్లీ భారీ విజయం ఖాయం’ అని అంటున్నారు.