నర్సాపూర్ మున్సిపల్​ చైర్మన్​ రేసులో ఆ ఇద్దరు..?

నర్సాపూర్ మున్సిపల్​ చైర్మన్​ రేసులో ఆ ఇద్దరు..?

మెదక్, నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్​బీజేపీలోకి వెళ్లిండని అతడి పదవికి అధికార పార్టీ కౌన్సిలర్లు ఎసరు పెట్టేందుకు పక్కా ప్లాన్​తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ సహా 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్ కు నోటీస్ ఇచ్చారు. నర్సాపూర్​ పట్టణం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్​ గ్రేడ్​ కాగా 2020 జనవరిలో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 15 వార్డులు ఉండగా 8 వార్డుల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు, నాలుగు వార్డుల్లో బీజేపీ క్యాండిడేట్లు, మూడు వార్డుల్లో ఇండిపెండెంట్లు కౌన్సిలర్లుగా గెలిచారు. బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఆ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్​గా, 6వ వార్డు కౌన్సిలర్ నయీమొద్దీన్ వైస్ చైర్మన్​ గా ఎన్నికయ్యారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఆయనకు మున్సిపల్​ చైర్మన్​పదవి దక్కినప్పటికీ, పార్టీ తనకు సముచిత స్థానం కల్పించలేదని బీఆర్ఎస్ అధిష్టానంపై లోలోన అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందని గతేడాది ఆగస్టులో ప్రెస్​మీట్​ పెట్టి పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనను బీఆర్ఎస్​ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో గత అక్టోబర్ లో ఇద్దరు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లతో కలిసి మురళీ యాదవ్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీఆర్​ఎస్​ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతడిని చైర్మన్​ పదవి నుంచి తప్పించాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మున్సిపల్​ కౌన్సిల్​లో ఆ పార్టీ బలం 8గా ఉండటంతోపాటు, అవసరమైతే ఎక్స్​ అఫీఫియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓటుతో చైర్మన్​ పదవి దక్కించుకోవచ్చని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితో మున్సిపాలిటీలో ఒక్కసారిగా రాజకీయ వేడీ పెరిగింది. 

అవిశ్వాసం నోటీస్​ ఇచ్చింది వీరే.. 

నర్సాపూర్​ 6వ వార్డు కౌన్సిలర్​ అయిన వైస్ చైర్మన్ నయిముద్దీన్​ సహా 1వ వార్డు కౌన్సిలర్​ అశోక్​ గౌడ్​, 3వ వార్డు కౌన్సిలర్​ ఇస్రత్​ బేగం, 7వ వార్డు కౌన్సిలర్​ రుక్కమ్మ, 8వ వార్డు కౌన్సిలర్​ రాంచందర్, 12వ వార్డు కౌన్సిలర్​ లక్ష్మి, 14వ వార్డు కౌన్సిలర్​ సరిత, 15వ వార్డు కౌన్సిలర్​ లలిత ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి హరీశ్ రావు ను కలిసి చైర్మన్​ పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయమై చర్చించారు. పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైస్ చైర్మన్ నయిమొద్దీన్  సహా 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం మెదక్ కలెక్టరేట్ కు వచ్చి కలెక్టర్ రాజర్షి షాకు అవిశ్వాసం నోటీసు అందజేశారు. మరి ఈ విషయంలో కలెక్టర్​ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

చైర్మన్​ రేసులో ఆ ఇద్దరు?

బీఆర్ఎస్​ కౌన్సిలర్ల అవిశ్వాస ప్రయత్నాలు ఫలించి మురళీ యాదవ్ చైర్మన్ పదవి కోల్పోతే బీఆర్ఎస్ లో ఎవరికి చాన్స్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కౌన్సిల్​లో బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 6వ వార్డు కౌన్సిలర్​గా గెలిచి వైస్ చైర్మన్ అయిన నయిమొద్దీన్ తో పాటు, ఒకటో వార్డు కౌన్సిలర్​ అశోక్ గౌడ్ చైర్మన్​ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్​ లీడర్​ అయిన అశోక్​ గౌడ్​ మున్సిపల్​ ఎన్నికల సమయంలోనే చైర్మన్​ పదవి ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం మురళీ యాదవ్​కు అవకాశం ఇచ్చింది. చైర్మన్​ పదవి ఆశించిన అశోక్​ గౌడ్​ భార్యకు వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవి ఇచ్చింది. కాగా ఇప్పుడు అవకాశం రావడంతో అశోక్​ గౌడ్​ మున్సిపల్​ చైర్మన్​ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.