గ్రీవెన్స్​లో గంటల తరబడి క్యూలైన్లలో జనం అవస్థలు

గ్రీవెన్స్​లో గంటల తరబడి క్యూలైన్లలో జనం అవస్థలు

మంచిర్యాల, వెలుగు: కలెక్టరేట్​లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​లో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేవారు సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్నారు.  ఇంతకుముందు కలెక్టర్​ భారతి హోళికేరి హయాంలో జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్​ను రద్దు చేసి మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఆయా మండలాల స్పెషల్​ ఆఫీసర్లు పాల్గొనగా, కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు చేసేవారు.  దీంతో వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టరేట్​కు రావడం తగ్గింది. నెల కింద బదావత్​ సంతోష్​ కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ప్రతి సోమవారం తన చాంబర్​లో కలెక్టర్​ అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.  అయితే  కలెక్టరేట్​లోని మొదటి అంతస్తులో గ్రీవెన్స్​ నిర్వహిస్తుండడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. 

క్యూలైన్లలో తిప్పలు...  

కలెక్టర్​ సంతోష్​ గ్రీవెన్స్​ కార్యక్రమాన్ని పున:ప్రారంభించడంపై ప్రజలు హర్షం చేస్తున్నా గంటల తరబడి క్యూలో నిల్చోవడానికి  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  సోమవారం కలెక్టర్​ మొదటి అంతస్తులో తన చాంబర్​లో ఉదయం 10 గంటల నుంచే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మధ్యాహ్నం దాదాపు 2గంటల వరకు కలెక్టర్​ను కలిసేందుకు జనం బారులుదీరారు. ఫస్ట్​ ఫ్లోర్​లోని వరండా ఇరుగ్గా ఉండడంతో కూర్చుకునేందుకు చోటు లేదు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు క్యూలైన్లలో నిలబడేందుకు ఇబ్బందులు పడుతున్నారు.  చాంబర్​ పక్కనున్న హాల్​ కూడా చాలడం లేదు.  రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల క్యూలైన్​లో ఒకరినొకరు తోసుకుంటున్నారు.  రెండు కాళ్లు లేని దివ్యాంగులు మెట్ల మీది నుంచి పైకి వెళ్లలేక కిందనే ఆగిపోతున్నారు. వీరి కోసం ర్యాంపులు గానీ, వీల్​ చైర్లు గానీ లేవు. వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్​ దాకా వస్తే కలెక్టర్​ను కలవకుండానే వెనక్కి పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కలెక్టరేట్​ కాంప్లెక్స్​లోని గ్రౌండ్​ ఫ్లోర్​లో గ్రీవెన్స్​ నిర్వహిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


కలెక్టర్‌‌‌‌ను కలవకుండానే వెనక్కి..

ఈ ఫొటోలో కనిపిస్తున్న లాపాక పెంటయ్య(65), రాజమ్మ(54) దంపతులది  చెన్నూర్ మండలం సోమన్‌‌పల్లి గ్రామం. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. కూలి చేసుకొని బతికేవారు. పెంటయ్య 15 ఏండ్ల కింద అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటినుంచి తన కాళ్లపై తాను నిల్చోలేడు, నడవలేడు. శరీరం వణుకుతూ అవస్థ పడుతున్నాడు. రాజమ్మ మూడేండ్ల కింద అనారోగ్యానికి గురైంది. నిలబడలేదు.. నడవలేదు. ఇద్దరూ నేలపై పాకుతూ వెళ్లాల్సిందే. చుట్టపక్కల దయతలిచి పెడితే కడుపు నిండినట్టు, లేకుంటే పస్తులే. వీరిద్దరికీ దివ్యాంగుల పెన్షన్‌‌కు రావడం లేదు. తమగోడును కలెక్టర్‌‌‌‌కు చెప్పుకుందామని ఓ బంధువు సాయంతో ఆటోలో సోమవారం కలెక్టరేట్‌‌కు వచ్చారు. కానీ పై అంతస్తు ఎక్కలేక.. బంధువుతో కలెక్టర్‌‌‌‌కు వినతిపత్రం అందించారు. ఎంతో కష్టపడి 60 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే కలెక్టర్‌‌‌‌ను కలవకుండానే వెళ్లిపోతున్నామని వాపోయారు.