
- మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్లిపోయిన వారు మళ్లీ పార్టీలోకి తిరిగి రావాలనుకుంటే క్షమాపణలు చెప్పి రావాలని ఆ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ డిమాండ్ చేశారు. నాయకులను తయారు చేసే కర్మాగారం లాంటిది కాంగ్రెస్ పార్టీ అని.. ఇక్కడ తయారయ్యే నాయకులే బీజేపీలో వున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్ లో జరిగిన సమావేవంలో ఆయన మాట్లాడుతూ సోనియా రేవంత్ ను పీసీసీగా నియమించి మంచి పనిచేసిందన్నారు. యువకుడు, చురుకైన నాయకుణ్ణి పీసీసీ చీఫ్ గా నియమించిందని, అదేవిధంగా కార్యవర్గంలో మరికొందరికి అవకాశం కల్పించిందన్నారు. రేవంత్ రెడ్డి డిగ్రీలో చదివేటప్పటి నుండి తనకు మంచి ఫ్రెండ్ అని.. ఇద్దరం ఒకే బెంచ్ లో కూర్చునే ఫ్రెండ్స్ అని ఆయన పేర్కొన్నారు.
కష్టాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది ఇద్దరే
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత ఇద్దరికే ఉందని.. ఒకరు మర్రి చెన్నారెడ్డి అయితే మరొకరు వైఎస్సార్ అని కుసుమకుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి సారధ్యంలోని బృందంపై పడిందని.. రేవంత్ కార్యకర్తల్లో ఉత్సహం నింపి.. మళ్లీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తాడని తనకు నమ్మకం ఉందన్నారు. రేవంత్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ వుందని, పార్టీకి అది బాగా ఉపయోగపడుతుందన్నారు.
రేవంత్ దూకుడుకు భయపడి కేసీఆర్ బయటికొస్తుండు
రేవంత్ రెడ్డి దూకుడుకు భయపడి సీఎం కేసీఆర్ బయటకు వచ్చి జనంలో తిరుగుతున్నారని పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పేర్కొన్నారు. కరోనా వచ్చినప్పటి నుండి జనానికి దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ ఇప్పుడు హడావుడి చేయడానికి కారణం ఒకరకంగా రేవంత్ రెడ్డేనని ఆయన అన్నారు. వైఎస్సార్ పీసీసీ గా బాధ్యతలు తీసుకునే సమయంలో గాంధీభవన్ కు గ్రానైట్ వేశారని, తర్వాత బొత్స సత్యనారాయణ పీసీసీ గా వున్నప్పుడు ఫర్నిచర్ మార్చారని గుర్తు చేస్తూ.. ఇప్పుడు రేవంత్ రాబోతున్నందున వాస్తు దోషాలను తొలగించి మంచి మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.