ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలు వద్దు

ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలు వద్దు

రామరాజ్యంలో సీతపై ఓ సామాన్యుడు చేసిన వ్యాఖ్యలను వేగులు రామునికి చేరవేశారు. ప్రజాభిప్రాయాన్ని రాముడు సావధానంగా స్వీకరించాడు తప్ప ఆ వ్యక్తిని నిర్బంధించలేదు. ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తన రాజధర్మం నిరూపించుకునేందుకు సీతను అడవులకు పంపించాడనేది.. ఇతిహాసాలు చెపుతున్న మాట. అది రాజుగా రాముడు నిర్వహించిన రాజధర్మం. కానీ ప్రస్తుతం ప్రజావ్యతిరేక విధానాలను, ప్రభుత్వ పాలసీలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ప్రీవెంటివ్​ డిటెన్షన్​ యాక్ట్ 1970 దారుణమైన విషయం. ఇలా కాకుండా ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని హుందాగా స్వీకరించాలి. ఉద్యమాలపై అణచివేత వైఖరిని విడనాడాలి. 

ప్రజాస్వామ్య దేశంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలు, పత్రికలు, మీడియా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు. ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపే, ఆరోపించే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్‌‌ 19 ప్రకారం ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించవచ్చు. అయితే చట్టాలను చేతిలోకి తీసుకునేలా హింస, ఆయుధాలు, విధ్వంసాలతో కాకుండా ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలి. పాలకులు అవలంబించే తప్పుడు విధానాలను ఎత్తి చూపాలి. ఇలాంటి పరిస్థితిల్లోనే ప్రజలకు ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందుతాయి. ఇదే సమయంలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలను పాలకులు సానుకూలంగా స్వీకరించాలి. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలి. అంతే కానీ అణచివేత ధోరణితో చట్టాలను దుర్వినియోగం చేయడం సరికాదు.

కక్ష, శతృత్వంతో దాడులు, కేసులు

ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు. ఇందుకోసం పోలీసులు, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో ఇన్వెస్టిగేషన్ సిస్టం కూడా పాలకులకు అనుకూలంగా పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేరస్తులు, లా అండ్ ఆర్డర్‌‌కు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకునేందుకు అనేక ఇండియన్​ పీనల్​ కోడ్(ఐపీసీ) సెక్షన్స్‌‌, చట్టాలు ఉన్నాయి. కానీ కొన్ని కేసుల్లో దేశద్రోహం, ప్రివెంటీవ్ డిటెన్షన్(పీడీ), అన్‌‌ లా ఫుల్‌‌ యాక్టివిటీస్‌‌ ప్రివెన్షన్‌‌(యూఏపీఏ) యాక్ట్‌‌లను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. తమను వ్యతిరేకించే వారిని నిర్బంధ చట్టాలతో ఏండ్ల తరబడి జైలు గోడల మధ్య బంధిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై వరుసగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో అమాయకులు కూడా జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.

ఇప్పటికీ బ్రిటిష్​ కాలంలో నాటి నిర్భంధాలు

తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై దేశద్రోహం కేసులు పెట్టడం బ్రిటిష్‌‌, నిజాం పాలనలో ఎక్కువగా ఉండేది. అవే చట్టాలను ఇప్పటి ప్రభుత్వాలు తమకు అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయనేది చెరుకు సుధాకర్ అరెస్ట్ సమయంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతోపాటు పీడీ, ఉపా యాక్ట్‌‌లను వాడటానికి నేటి పాలకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసే సమయంలో ఇండియన్ ఎవిడెన్స్‌‌ యాక్ట్‌‌లోని సెక్షన్‌‌ 25, 26లను ఫాలో కావాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఏదైనా నేరం జరిగితే అందుకు సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతే సెర్చ్‌‌ చేస్తారు. నేరం చేసిన నిందితుడిని లీగల్‌‌గా అరెస్ట్ చేస్తారు. కానీ మనదేశంలో ఎవిడెన్స్‌‌ యాక్ట్‌‌ను ఇన్వెస్టిగేషన్ అధికారులు  ఫాలో కావడం లేదు.

సెర్చ్‌‌ ప్రొసీజర్ ఫాలో కావడం లేదు

ప్రముఖ సోషల్‌‌ యాక్టివిస్ట్‌‌ స్టాన్ స్వామి కేసులో కూడా దర్యాప్తు సంస్థలు సెర్చ్‌‌ ప్రొసీజర్‌‌‌‌ను పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ల్యాప్‌‌ట్యాప్‌‌లో కీలకమైన లెటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. దేశద్రోహం కేసులు నమోదు చేశాయి. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు అధికారులు ఎలాంటి సెర్చ్‌‌ వారెంట్‌‌ లేకుండానే సోదాలు జరుపుతున్నాయి. అనుమానితుల ఇండ్లలో పంచ్‌‌ల సమక్షంలోనే సెర్చ్​లు జరగాలి. సెర్చ్​కు ముందు తమ వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్‌‌, మెటీరియల్స్‌‌ లేని విషయం పంచ్​ల దృష్టిలో పెట్టాలి. అలా జరగకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌‌ ఫేక్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్​ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కేసుల్లో పోలీస్ అధికారుల ముందు నిందితులు ఇచ్చే కన్ఫెషన్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌ను కోర్టులు నమ్మే అవకాశం ఉండదు. మేజిస్ట్రేట్‌‌ సమక్షంలో రికార్డ్‌‌ చేసిన స్టేట్‌‌మెంట్స్‌‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ఇలాంటి కేసుల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్‌‌ల పరిశీలన కోసం టెక్నికల్‌‌ కమిటీతో మానిటరింగ్ చేయాలి. అనుమానితుల అరెస్ట్‌‌కు ముందు, అరెస్ట్‌‌ తర్వాత జరిగిన టెక్నికల్‌‌ ట్రాన్స్‌‌ఫర్స్‌‌ను గుర్తించాలి.

పీడీ, ఉపా యాక్ట్‌‌ అమలుపై పర్యవేక్షణ లోపం

ప్రస్తుతం వరుస నేరాలు, ప్రాపర్టీ అఫెన్స్‌‌లు, శాంతి భద్రతకు విఘాతం కలించే వారిపై పీడీ యాక్ట్‌‌ ప్రయోగిస్తున్నారు. అయితే పీడీ, ఉపా లాంటి యాక్ట్స్‌‌ అమలు చేసే సమయంలో సరైన నియమాలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం వరుసగా మూడు నుంచి ఆరు నేరాలు చేసిన వారిపై మాత్రమే పీడీ యాక్ట్‌‌ను అమలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరితంగా పీడీ యాక్ట్‌‌, ఉపా ప్రయోగిస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఓ వ్యక్తిపై పీడీ యాక్ట్‌‌ ప్రయోగించే సమయంలో స్థానిక పోలీసులు నిబంధనలు పాటించడం లేదు. కమిటీకి పంపే ప్రపోజల్స్‌‌లో యాక్ట్‌‌ ప్రొసీజర్‌‌‌‌ను పాటించడం లేదు. పీఎస్‌‌లో ఎప్పుడో రిజిస్టరైన కేసులు, కోర్టుల్లో కొట్టేసిన కేసులను కూడా పీడీ యాక్ట్‌‌ ఇన్వోక్ చేయడంలో వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సై స్థాయి పోలీసులు రూపొందించే రిపోర్ట్‌‌నే కమిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే సరైన పర్యవేక్షణ లేకుండానే డీఎస్పీ, కలెక్టర్ స్థాయి అధికారుల కమిటీ పీడీ యాక్ట్‌‌ అమలుకు అంగీకరిస్తోంది.

ఇండిపెండెంట్‌‌ బాడీలు ఏర్పాటు చేయాలె

పీడీ యాక్ట్‌‌, ఉపా కేసుల్లో అమాయకులు చిక్కుకోకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండిపెండెంట్‌‌ బాడీలను ఏర్పాటు చేయాలి. అందులో రిటైర్డ్ జడ్జీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, లాయర్స్‌‌, సోషల్‌‌ యాక్టివిస్ట్స్‌‌ లాంటి వారితో వీటిని క్రియేట్‌‌ చేయాలి. కమిటీ ఆమోదం తెలిపిన పీడీ యాక్ట్‌‌ కేసులను పరిశీలించేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలి. పీడీ యాక్ట్‌‌ కేసులపై క్షేత్రస్థాయిలో ఇండిపెండెంట్‌‌ బాడీ విచారించేలా చర్యలు తీసుకోవాలి. పోలీసులు అందించిన రిపోర్ట్స్‌‌ ఆధారంగా నిందితులపై ప్రపోజ్‌‌ చేసిన పీడీ యాక్ట్‌‌ కేసులపై నిజానిజాలు పరిశీలించాలి. ఇండిపెండింట్‌‌ బాడీ ఇచ్చే నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులను నిర్బంధించాలా? వద్దా? అనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవాలి. దీంతో పాటు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు, నేరాల వివరాలను గుర్తించాలి. పీడీ యాక్ట్‌‌ అమలు చేసేందుకు రిజిస్టరైన కేసులను పరిశీలించాలి. డాక్యుమెంట్స్‌‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే పీడీ యాక్ట్‌‌, ఉపా అమలుపై ప్రజల్లో విశ్వాసం పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వాలపై వచ్చే ఆరోపణలను సానుకూలంగా స్వీకరిస్తూ పాలకులు ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని ఆశిద్దాం.

టీఎస్‌‌ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దారుణం

రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌‌ ప్రివెంటివ్‌‌ డిటెన్షన్‌‌ యాక్ట్‌‌ 1970ని అమలు చేస్తోంది. రాష్ట్ర భద్రతకు ప్రమాదం కలిగినప్పుడు, ఎమర్జెన్సీ సర్వీసులకు ఆటంకం కలిగినప్పుడు మాత్రమే ఈ యాక్ట్‌‌ను ప్రయోగించాలి. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్స్‌‌కు ఈ యాక్ట్‌‌పై ఆర్డర్ చేసే పవర్స్ ఉంటాయి. ఇందుకు 12 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ ఆర్డర్‌‌పై కోర్టులో సవాల్‌‌ చేసినా దాన్ని కొట్టేసేందుకు వీలుండదు. ఇలాంటి ఆర్డర్‌‌‌‌తో కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. జ్యురిస్డిక్షన్‌‌తో సంబంధం లేకుండా ఎవరినైనా సరే ఈ యాక్ట్‌‌పై అరెస్ట్‌‌ చేసి నిర్బంధించవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించడం దారుణమైన అంశం. 1970 నాటి చట్టంలో అనేక మార్పులు చేసి ఇప్పుడు వాడుతున్నారు.

బ్రిటిష్, నిజాం పాలన నుంచే దేశద్రోహం కేసులు

రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై కేసులు పెట్టి వేధించడం ప్రస్తుతం ఎక్కువగా జరుగుతోంది. కక్ష సాధింపు, శతృత్వంతో కేసుల్లో ఇరికిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దేశంలో బాంబ్​ బ్లాస్టులు చేసే టెర్రరిస్టులు, ప్రభుత్వాలను పడగొట్టేలా కుట్రలు చేసే వారిపై సాధారణంగా దేశద్రోహం 120(బి), ఉపా కింద కేసులు పెడతారు. ఇలాంటి కేసులు పెట్టే అప్పటి బ్రిటిష్‌‌ పాలకులు బాలగంగాధర్​ తిలక్‌‌, భగత్‌‌సింగ్‌‌, రామానంద తీర్థ లాంటి వారిపై దేశద్రోహులనే ముద్ర వేశారు. నాటి నిజాం ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు సహా తెలంగాణ సాయుధ పోరాట యోధులను దేశద్రోహులుగా అభివర్ణించింది. ఇలా ఏ ప్రభుత్వ పాలనలోనైనా సరే ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడే వారిపై కక్ష సాధింపు చర్యలతో లొంగదీసుకోవాలనే ప్రయత్నాలు జరగడం సాధారణం. ఇలాంటివే ఇటీవలి కాలంలో  తెలంగాణాలో, దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి.

అన్‌‌ సోషల్‌‌ యాక్టివిస్ట్‌‌గా ముద్ర వేసేందుకు..

ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిది అనే ప్రచారం చేస్తే వేటాడి చంపుతారు. పెత్తందారీ వ్యవస్థలో గ్రామాల్లోనూ ఇలాగే జరిగేది. తమకు అనుకూలంగా లేని కుటుంబాలను మంత్రగాడనో లేదా ఇతర అపవాదులు మోపి గ్రామస్తులతో దాడులకు ప్రేరేపించేవారు. ప్రస్తుత కాలంలో ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు, సోషల్‌‌ యాక్టివిస్ట్‌‌లపై దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ పాలనను వ్యతిరేకించే వారిపై విధ్వంసాలకు ప్రేరేపించారని, రెచ్చగొట్టారని, సహకరించారనే ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని కొన్ని సందర్భాల్లో వెలుగు చూశాయి. ఇందుకోసం పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో  ప్రభుత్వ పాలసీలను ప్రశ్నించడం, వ్యతిరేకించే వారిని కక్షపూరితంగా నిర్బంధిస్తున్నాయి. తాము టార్గెట్ చేసిన వ్యక్తిపై అక్రమ కేసులు పెడుతున్నాయి. ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్‌‌లు లేకుండా పోలీసులు అందించే రిపోర్ట్ ఆధారంగానే పీడీ యాక్ట్‌‌ అమలు చేస్తున్నాయి. ఇందుకు కారణం సరైన పర్యవేక్షణ లేకపోవడమే.

- జస్టిస్‌‌ బి.చంద్రకుమార్, రిటైర్డ్‌‌  జడ్జి, హైకోర్ట్‌‌