సింగరేణి సంస్థలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి : ఎమ్మెల్యే కూనంనేని

    సింగరేణి సంస్థలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి : ఎమ్మెల్యే కూనంనేని

కోల్​బెల్ట్, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్​ సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సీఎండీగా శ్రీధర్​ బొడ్రాయిలా తొమ్మిదేండ్లుగా తిష్టవేసుకొని కూర్చున్నారని, ఆయన హయాంలో సంస్థకు చెందిన వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని  కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ రాష్ట్ర ​ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి సీఈఆర్​ క్లబ్​లో నిర్వహించిన ఏఐటీయూసీ ఏరియా జనరల్​ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎండీ శ్రీధర్​ వల్ల సింగరేణి పతనమయ్యిందన్నారు. కేసీఆర్, శ్రీధర్  మధ్య ఉన్న లింక్  ఏమిటో తేలుస్తాతామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్​ సర్కార్​ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసం, సింగరేణి మనుగడపై  అసెంబ్లీలో చర్చ పెట్టిస్తానని చెప్పారు. ‘‘బీఆర్​ఎస్​ సర్కారు, శ్రీధర్​ నిర్వాకం వల్ల సింగరేణి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. ఉద్యోగులజీతాల కోసం రెండు బ్యాంకుల నుంచి  రూ.21వేల కోట్లను  అప్పుగా తీసుకురావాల్సిన దుస్థితి వచ్చింది. 

సంస్థకు సంబంధించిన వేల కోట్ల డబ్బును ఎవరు తిన్నారో గుర్తించి వాళ్ల నుంచి ఆ నిధులు కక్కిస్తాం. కేసీఆర్​, సీఎండీ శ్రీధర్.. ఎవ్వరైనా వదలిపెట్టం. రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్​కోలో రూ.85 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. అందులో సింగరేణి సంస్థకు చెందిన రూ.29 వేల కోట్లు ఉన్నాయి. సింగరేణి బొగ్గు, విద్యుత్ బకాయిలు రూ.29 వేల కోట్లను బీఆర్ఎస్​ సర్కార్​ నుంచి ఇప్పించడంలో సీఎండీ శ్రీధర్​ నిర్లక్ష్యం చేశాడు. కార్మికుల ఓట్లతో గెలిచిన టీబీజీకేఎస్​ లీడర్లు.. బకాయిలు అడిగే దమ్ములేక కాలం వెళ్లబుచ్చారు. అలాంటి వారు సింగరేణిని ఎలా కాపాడుతారు? ఈ దొంగలు మళ్లీ ఐఎన్టీయూసీలోకి వెళ్తున్నారు. ఐఎన్టీయూసీ వాళ్లు మళ్లీ టీబీజీకేఎస్​ నేత వెంకట్రావును కొంటున్నారు. ఎంత మంది వెళ్లినా ఏఐటీయూసీ గెలుపును ఆపలేరు” అని కూనంనేని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కోసం గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ చుక్క గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. 

ఐఎన్టీయూసీతో పొత్తు లేదు

బీజేపీ, బీఆర్ఎస్​ను ఓడించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు సీపీఐ మద్దతు ఇచ్చినా.. కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఒంటరిగా  పోటీ చేస్తున్నదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్​ అనుబంధ ఐఎన్టీయూసీతో ఎలాంటి  పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్​ సింగరేణి కార్మికులను నమ్మించి మోసం చేశాడని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తెస్తానని, సంస్థలో లక్ష మంది ఉద్యోగులు ఉండేలా చూస్తానని, వేజ్​బోర్డును ఇక్కడి తీసుకువస్తానని కేసీఆర్  మాయమాటలు చెప్పడంతో బీఆర్ఎస్​ అనుబంధ టీబీజీకేఎస్​ను కార్మికులు రెండుసార్లు గెలిపించి మోసపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, అడిషనల్​ జనరల్​ సెక్రటరీ మిరియాల రంగయ్య, సెంట్రల్​ సెక్రటరీలు బోస్​, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. కాగా, మందమర్రి ఏరియా ఏఐటీయూసీ జనరల్​ బాడీ మీటింగ్​ను పురస్కరించుకొని యూనియన్​ శ్రేణులు బైక్​ ర్యాలీ నిర్వహించాయి.