కేరళ నరబలి కేసు నిందితులకు 12 రోజుల పోలీస్ కస్టడీ

కేరళ నరబలి కేసు నిందితులకు 12 రోజుల పోలీస్ కస్టడీ

కేరళ నరబలి కేసులో నిందితులైన ముగ్గురికి 12 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్రంలోని పథనంథిట్ట జిల్లా తిరువళ్లకు చెందిన దంపతులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని క్షుద్రపూజలు చేశారు. ఇద్దరు మహిళలను బలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు కోటీశ్వరులమవుతామని భావించారు. ఈ క్రమంలో జూన్​లో రోసెలిన్, సెప్టెంబర్​లో పద్మ అనే మహిళలను తమ ఇంట్లో గొంతు కోసి చంపారు. వాళ్ల డెడ్ బాడీలను ముక్కలుగా నరికి తిరువళ్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పాతిపెట్టారు. హత్యకు గురైన ఇద్దరు మహిళలది ఎర్నాకులం జిల్లా అని పోలీసులు వెల్లడించారు. వయసు 50 ఏండ్లు ఉంటుందని పేర్కొన్నారు. వీళ్లను రషీద్ అలియాస్ మహమ్మద్ షఫీ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి దంపతుల ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

గత నెలలో పద్మ కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె ఫోన్లు మహమ్మద్ షఫీ దగ్గర ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్య విషయం బయటపడింది. అనంతరం దంపతులను విచారించడంతో తాము మరో హత్య కూడా చేసినట్లు ఒప్పుకున్నారు. ‘ఈ కేసులో చాలా కోణాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలను బట్టి నరబలి ఇచ్చినట్లు గుర్తించాం’ అని కొచ్చి పోలీసులు తెలిపారు.

ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చినంక వాళ్ల శరీర భాగాలను నిందితులు వండుకు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ముందు బాధితులను ఘోరంగా హింసించినట్లు గుర్తించారు. మహిళల రొమ్ములను కట్ చేసి, రక్తం పారేలా చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయని చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కేరళలోని పథనంథిట్ట జిల్లా ఎలంథూర్ లో జరిగింది. రోసెలిన్, పద్మ అనే మహిళలను ట్రాప్ చేసిన మహమ్మద్ షఫీ(52).. భగవల్ సింగ్, లైలా దంపతులతో కలిసి వాళ్లను చంపేశాడు. నరబలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని దంపతులను నమ్మించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పద్మ గొంతు కోసి తల నరికేసిన షఫీ.. ఆమె బాడీని 56 ముక్కలు చేశాడని పోలీసులు చెప్పారు. అవన్నీ మూడు గుంతల్లో దొరికాయని తెలిపారు. రోసెలిన్ ను లైలా గొంతు కోసి చంపిందని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షఫీనే అని వివరించారు.