ఒంటరి వృద్ధురాలిపై పెప్పర్ స్ప్రే కొట్టి.. 10 తులాల బంగారం దోపిడీ

ఒంటరి వృద్ధురాలిపై పెప్పర్ స్ప్రే కొట్టి.. 10 తులాల బంగారం దోపిడీ
  • ఇద్దరు మహిళలు సహా వ్యక్తి అరెస్ట్

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి ఓ మహిళ స్కెచ్​ వేసింది. మరో ఇద్దరి సాయంతో ఇంట్లోకి చొరబడి పెప్పర్​ స్ప్రే కొట్టి, దిండుతో అదిమిపట్టి, అరుపులు వినపడకుండా టీవీ సౌండ్​ పెద్దగా పెట్టి చోరీకి పాల్పడింది.  కర్మన్ ఘాట్ లోని పద్మానగర్​లో సుగుణమ్మ(68) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె కొడుకు లండన్​లో ఉంటున్నాడు. 

ఆమెకు పరిచయస్తురాలు అయిన గ్రీన్ పార్క్ కాలనీ కి చెందిన సుమిత్ర అనే మహిళ వృద్ధురాలి ఇంటిపై కన్నేసింది. చోరీ చేసేందుకు బోరబండలో ఉండే తన సోదరి సుశీల, మరిది శివకృష్ణ సాయం తీసుకుంది. పక్కా ప్లాన్​ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుగుణమ్మ ఇంట్లోకి ముందుగా సుమిత్ర వెళ్లింది. ఆమెను మాటల్లో పెట్టి పెప్పర్​ స్ప్రే ముఖంపై చల్లింది. బయట ఉన్న సోదరి, మరిదిలను ఇంట్లోకి పిలిచింది. వీరు అరుస్తున్న వృద్ధురాలిని నిర్బంధించి, ముఖానికి దిండు అడ్డు పెట్టారు

టీవీ సౌండ్ పెంచి అరుపులు బయటకు రాకుండా చేశారు. లాకర్​ తాళాలు ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వకపోవడంతో వృద్ధురాలిని చితకబాది ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు సుమారు 10 తులాల వరకు తీసుకొని పరారయ్యారు.  ఈ కేసులో నిందితులు ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ కృష్ణయ్య, సీఐ సైదిరెడ్డి తెలిపారు. 

మరోచోట బస్సులో బంగారం చోరీ

ఎల్బీనగర్: యాదాద్రి -భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యానగర్‌కు చెందిన రమణమ్మ(60) ఎల్బీనగర్‌ నుంచి చౌటుప్పల్‌ బస్సు ఎక్కి హయత్‌నగర్ చేరుకునే సరికి బ్యాగ్‌ జిప్‌ తెరిచి ఉండడాన్ని గమనించింది. పరిశీలించగా బ్యాగ్‌లోని 7 తులాల బంగారం, వెండి ఆభరణాలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదుతో  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.