డ్రగ్స్​ మెడిసిన్ విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

డ్రగ్స్​ మెడిసిన్ విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్
  • టాస్క్​ఫోర్స్, బేగంపేట పోలీసుల దాడి 
  • రూ.45వేల విలువైన  11 రకాల మెడిసిన్ సీజ్  

సికింద్రాబాద్​, వెలుగు: మెడికల్ షాపులో అక్రమంగా నార్కోటిక్​ డ్రగ్స్​ విక్రయిస్తున్న  ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.45 వేల విలువైన 11 రకాల  డ్రగ్స్​కలిగిన మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. టాస్క్​ఫోర్స్​ పోలీసులు, బేగంపేట పోలీసులతో  కలిసి జాయింట్ ఆపరేషన్  చేశారు.   మారేడుపల్లిలో ఉండే ముఠా కిషోర్​(58) ఎలాంటి విద్యార్హత, మెడికల్ ఎక్స్ పీరియన్స్ లేకున్నా..  20 ఏండ్లుగా మెడికల్​ ఫీల్డ్​లో ఉంటూ  సికింద్రాబాద్ లోని  రసూల్ పురాలో మహావీర్ మెడికల్ షాపును నిర్వహిస్తుంది. 

మెడికల్ షాపు బొలిశెట్టి అవినాశ్​ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ ​అయి ఉంది. అతని పేరిట షాపును ముఠా కిషోర్​ నిర్వహిస్తున్నాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ముఠాకిషోర్  మెడికల్ రిప్రజెంటేటివ్  బోయిన్​పల్లికి చెందిన ఇరేని రమేశ్​గౌడ్(30) ద్వారా నార్కోటిక్ మందులను కొనుగోలు చేశాడు. వాటిని   బేగంపేట్​కు చెందిన ముస్లం రాజు(39)తో కలిసి డ్రగ్స్​కు ఎడిక్ట్ అయినవారికి వారికి డాక్టర్​ప్రిస్కిప్షన్​ లేకుండానే విక్రయిస్తున్నాడు. రమేశ్​గౌడ్​నకిలీ బిల్లులతో సరఫరా చేసేవాడు. సమాచారం అందడంతో  నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు  బేగంపేట పోలీ సులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందితో  కలిసి ఆదివారం దాడులు చేసి పలు రకాల మెడిసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో రష్మీ పెరుమాళ్, డిప్యూటీ  కమిషనర్ హైదరాబాద్ నార్త్ టాస్క్ ఫోర్స్, ఇన్ స్పెక్టర్ గోవింద్ సింగ్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ రామయ్య, బేగంపేట ఎస్ ఐలు అశోక్ రెడ్డి, జ్ఞానదీప్ పాల్గొన్నారు.