భూ వివాదం వల్లే రియల్టర్ హత్య

భూ వివాదం వల్లే రియల్టర్  హత్య

మాదాపూర్, వెలుగు: సోమవారం తెల్లవారుజామున జరిగిన రియల్టర్ హత్య కేసును మాదాపూర్​ పోలీసులు ఛేదించారు. భూ వివాదమే హత్యకు కారణమని తేల్చి ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. మంగళవారం మాదాపూర్​ పీఎస్​​లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మాదాపూర్​ జోన్​ ఇన్​చార్జి​ డీసీపీ సందీప్​ వెల్లడించారు.  దుండిగుల్​ దొమ్మర పోచంపల్లి ప్రాంతానికి చెందిన ముజాహిద్​(50),  యూసఫ్​గూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్​ జిలానీ పాషా(25),  కాలాపత్తర్​కు చెందిన ఇస్మాయిల్ (38)   రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తున్నారు. వీరిపై సిటీలోని పలు పీఎస్​లలో గొడవలు, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్​పై రౌడీ షీట్​ ఉంది. ఓ హత్య కేసులో బెయిల్​పై బయటకు వచ్చాడు. జైలులో ఉన్న టైమ్​లో  అతడికి ముజాహిద్​, జిలానీ పాషాతో పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్​ అయ్యారు. బయటకు వచ్చాక  ముగ్గురు కలిసి ల్యాండ్​ సెటిల్​మెంట్లు మొదలుపెట్టారు. జహీరాబాద్​ దగ్గరలోని రంజోల్​లో 3 ఎకరాల్లో వెంచర్​ వేశారు. ఇస్మాయిల్​మరోసారి జైలుకు వెళ్లిన టైమ్​లో ముజాహిద్​, జిలానీలు వెంచర్​​లోని కొన్ని ప్లాట్లను అమ్ముకున్నారు. బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న ఇస్మాయిల్​దీనిపై ముజాహిద్​ను నిలదీశాడు. దీంతో ముజాహిద్​ తాడ్​బన్​ దగ్గర ఉన్న 250 గజాల ల్యాండ్​ను ఇస్మాయిల్​ పేరుపై గిఫ్ట్​ డీడ్​ చేశాడు. ఆ తర్వాత తనకు 250 గజాల ల్యాండ్​ ఇవ్వాలని, నీకు రూ. 20లక్షలు ఇస్తానని ఇస్మాయిల్​తో ముజాహిద్ చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో ఇదే విషయమై ముజాహిద్​, ఇస్మాయిల్​ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముజాహిద్​తో వచ్చిన జిలానీ పాషాపై ఇస్మాయిల్​ దాడి చేయడంతో పాటు ముజాహిద్​ను బెదిరించాడు. అప్పటి నుంచి ఇస్మాయిల్​పై ముజాహిద్​, జిలానీ పాషా పగ పెంచుకున్నారు. ఇస్మాయిల్​ నుంచి ప్రాణభయం ఉందని నిర్ణయించుకున్నారు.

యూపీ నుంచి గన్స్​, బుల్లెట్లు తెచ్చుకుని..

ఇస్మాయిల్​ నుండి ప్రాణభయం ఉందనుకొని ముజాహిద్​, జిలానీ యూపీకి వెళ్లి తుండా అనే వ్యక్తి వద్ద రెండు కంట్రీమేడ్​ గన్స్, 7 రౌండ్ల బుల్లెట్లు కొన్నారు. ఆదివారం సాయంత్రం ల్యాండ్ సెటిల్​మెంట్​​ విషయంపై మాట్లాడు​కుందామని ముజాహిద్..​ ఇస్మాయిల్​కు కాల్​ చేసి చెప్పాడు. దీంతో ఇస్మాయిల్​ తన ఫ్రెండ్స్​ జహంగీర్​, అక్రం, గౌస్​తో కలిసి కారులో  రాత్రి 7 గంటలకు బహదూర్​పూరాకు వచ్చాడు. ముజాహిద్​ సైతం కారులో రాగా అతడి అనుచరులు జిలానీ, ఫిరోజ్​ ఖాన్​ బైక్​పై వచ్చారు.

వెనుకాలే స్కూటీపై జిలానీ, ఫిరోజ్​ఖాన్..

అక్కడ ఇస్మాయిల్​ను కారులో ఎక్కించుకున్న ముజాహిద్   మాదాపూర్​  100 ఫీట్​ రోడ్​ దగ్గరికి తీసుకొచ్చాడు. వీరి వెనుకాలే స్కూటీపై జిలానీ, ఫిరోజ్​ఖాన్ వచ్చారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అక్కడే అందరూ కలిసి టిఫిన్​ చేశారు. మరోసారి ల్యాండ్ గురించి ఇస్మాయిల్, ముజాహిద్ మళ్లీ మాట్లాడుకోగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.   జిలానీ తన వెంట తెచ్చుకున్న గన్​తో ఇస్మాయిల్​ను కాల్చేందుకు యత్నించగా మిస్​ఫైర్ అయ్యింది. వెంటనే ఇస్మాయిల్​ రోడ్డుకు అవతలి వైపు కారులో ఉన్న జహంగీర్​ను పిలిచాడు. ఈలోగా జిలానీ గన్​ లోడ్ చేసుకుని మళ్లీ వచ్చి ఇస్మాయిల్​ తల వెనుక భాగంలో  కాల్చాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన జహంగీర్​ను​ తలపై గన్​తో కొట్టాడు. తర్వాత జిలానీ, ఫిరోజ్​ బైక్​పై , ముజాహిద్ కారులో పారిపోయాడు. ఇస్మాయిల్​ను ఉస్మానియాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.  విషయం తెలుసుకున్న మాదాపూర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  క్లూస్​ టీమ్​ను రప్పించి వివరాలు సేకరించారు.

నిందితుల కోసం 7 స్పెషల్​ టీమ్స్​

నిందితుల కోసం మాదాపూర్​ ఇన్ చార్జి​ డీసీపీ సందీప్​ 7 స్పెషల్ టీమ్స్​ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు స్కూటీపై వెళ్తున్న జిలానీ పాషా, ఫిరోజ్​ఖాన్​ను శంకర్​పల్లి దగ్గరలోని జన్వాడ వద్ద స్పెషల్ టీమ్​ అదుపులోకి తీసుకుంది. ముజాహిద్​ను మంగళవారం ఉదయం 10 గంటలకు జహీరాబాద్​ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ముజాహిద్​ వాడిన కారును చేవెళ్లలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రెండు  గన్స్​​, 7 రౌండ్ల బుల్లెట్స్​, కత్తి, కారు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.