కోర్టు వారెంట్లు అడ్డుపెట్టుకొని వసూళ్లు

కోర్టు వారెంట్లు అడ్డుపెట్టుకొని వసూళ్లు

ఎల్​బీనగర్,వెలుగు: కోర్టు వారెంట్లతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను, మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు చెందిన కోర్టు కానిస్టేబుల్ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు, కానిస్టేబుల్ మల్లేశం కోర్టు వారెంట్ రీకాల్ విధులు నిర్వహిస్తున్నారు.

వీరు ముగ్గురూ కొంతకాలంగా పలు కేసుల్లో వారెంట్లు జారీ అయిన నిందితులను బెదిరిస్తూ, డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చైతన్యపురి పీఎస్​లో బుధవారం రాత్రి నుంచి సోదాలు చేసి ఆధారాలు సేకరించారు. ముగ్గురు పోలీసు సిబ్బందితో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని..

నూజివీడుకు చెందిన ఎ. వెంకటరమణ కొత్తపేటలో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని పలువురు స్టూడెంట్ల వద్ద డబ్బులు వసూలు చేశాడు. సీట్లు ఇప్పించకపోవడంతో బాధిత స్టూడెంట్లు 2022లో చైతన్యపురి, ఎల్​బీనగర్  పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా.. వెంకటరమణపై పోలీసులు చీటింగ్ కేసులు నమోదు చేశారు.  బెయిల్ పొందిన అతడు చైతన్యపురి పీఎస్ కేసులో గతేడాది అక్టోబర్​లో  కోర్టు వారెంట్ జారీ అయింది.

దీంతో కోర్టు కానిస్టేబుళ్లు నరేందర్, వారంట్ టీమ్ ప్రసాద్ బాబు, మల్లేశం అతడిని సంప్రదించి సెటిల్ చేసుకోవాలని బెదిరింపులకు దిగారు. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ 25న వెంకటరమణను అల్కాపురిలోని పార్కుకి తీసుకెళ్లి బేరమాడారు.  వెంకటరమణ తండ్రి, సోదరుడికి ఫోన్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తామని బెదిరించారు. రూ.25 లక్షలు ఇవ్వాలని లేదంటే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కానిస్టేబుళ్లు డబ్బుల వసూలు బాధ్యతను తమకు తెలిసిన సోమశేఖర్, రాఘవేంద్ర గుప్తా, చైతన్య, రామకృష్ణకు అప్పగించారు.

డబ్బులు ఇవ్వాలంటూ వెంకటరమణపై భౌతిక దాడులు చేయడంతో తప్పని పరిస్థితుల్లో రూ.5 లక్షలు ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకోగా.. వెంటనే  ట్రాన్స్​ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో వెంకటరమణ  తండ్రి ద్వారా క్యాష్​ను సోమశేఖర్ తన భార్య ఎస్​బీఐ అకౌంట్​కు రూ.2లక్షలు ట్రాన్స్​ఫర్ చేయించారు. ఆ క్యాష్​ను ముగ్గురు కానిస్టేబుళ్లు పంచుకోగా.. మిగతా రూ. 3 లక్షల కోసం మళ్లీ వేధించసాగారు. గతేడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు మరో రూ.1.50 లక్షలు వసూలు చేశారు.

దీంతో వేధింపులు భరించలేక వెంకటరమణ హైకోర్టు లాయర్ సాయంతో ఏసీబీని ఆశ్రయించగా విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తుండగానే  కోర్టుకు వెళ్లిన వెంకటరమణను రూ.50వేలు ఇవ్వాలని బెదిరించారు. చివరకు నరేందర్, మల్లేశం ఇద్దరూ రూ.25వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సంక్రాంతి రోజు డబ్బులు కావాలని వెంకటరమణ సోదరుడికి ఫోన్ చేసి బెదిరించి స్విగ్గీ డెలివరీ బాయ్ రాఘవేంద్ర గుప్తా గూగుల్ పేకు  రూ.1,500 ట్రాన్స్ ఫర్ చేయించారు. ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి చైతన్యపురి పీఎస్ లో సోదాలు చేశారు. ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్​కు తరలించారు.