దేశంలో చివరి దశలో మూడు టీకాలు

దేశంలో చివరి దశలో మూడు టీకాలు
  • చివరి దశలో మూడు టీకాలు
  • కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ వెల్లడి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి (2021, ఫస్ట్ క్వార్టర్) నాటికి రెడీ కావచ్చని సోమవారం కేంద్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్ష వర్ధన్ వెల్లడించారు. ప్రస్తుతం  దేశంలో మొత్తం30 వ్యాక్సిన్ క్యాండిడేట్లు డెవలప్ మెంట్ దశలో ఉన్నాయని, మూడు వ్యాక్సిన్ లు ఫేజ్ 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. కరోనా నివారణలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన పార్లమెంటుకు వివరించారు.  నాలుగుకు పైగా వ్యాక్సిన్ లు అడ్వాన్స్ డ్ ప్రీక్లినికల్ డెవలప్ మెంట్ దశలో ఉన్నాయని, మంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే కరోనాను కంట్రోల్ చేయొచ్చన్నారు. ఐసీఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్  తయారు చేస్తున్న తొలి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ ‘కొవ్యాక్సిన్’, జైడస్ క్యాడిలా తయారు చేస్తున్న జైకొవిడ్ వ్యాక్సిన్ ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో కలిసి సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ దశలో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా145 వ్యాక్సిన్ లు ప్రీక్లినికల్ ఎవాల్యుయేషన్ దశలో, 35 వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని మంత్రి వివరించారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం.. ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్’ను నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) ఆధ్వర్యంలో  నియమించిందని హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ డెవలప్ మెంట్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. కరోనా ట్రీట్ మెంట్ లో  ‘సెప్సివ్యాక్’ మందును వాడేందుకు ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని మంత్రి చెప్పారు. మొక్కల నుంచి సేకరించిన ఏక్యూసీహెచ్ మందుపై ఫేజ్ 2 ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. మధ్యస్థంగా సింప్టమ్స్ ఉన్న కరోనా పేషెంట్లపై అశ్వగంధకు సంబంధించిన ఒక ఇమ్యూనిటీ ట్రయల్..  గుడుచి +  పిప్పలి, యష్టిమధు, పాలీహెర్బల్ ఆయుష్ డ్రగ్ (ఆయుష్ 64)కు సంబంధించిన మూడు ట్రయల్స్ జరగనున్నాయని చెప్పారు. కొవిడ్ –19 బయోరిపోజిటరీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా 40 వేల శాంపిళ్లు సేకరించామని, వీటిని మందులు, వ్యాక్సిన్ లు తయారు చేసేందుకు రీసెర్చర్లకు అందుబాటులో ఉంచామన్నారు. కరోనాను మేనేజ్ చేయడంలో ఆయుష్ మినిస్ట్రీ అనేక రకాలుగా సహాయం చేసిందన్నారు.