తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే మరాఠ్వాడా, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం చెప్పింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
