- ఒకే గుట్టపైన ఒకే చోట మూడు
మద్దూరు,వెలుగు: నారాయణపేట జిల్లాలో ఒకే గుట్ట మీద మూడు చిరుత పులులు కనిపించి కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే.. మద్దూరు మండలం పెదిరిపహాడ్ గ్రామ శివారు కోతులగుట్ట తండా సమీపంలోని ఒకే గుట్టపై సోమవారం సాయంత్రం మూడు చిరుత పులులు కనిపించాయి. దీంతో తండావాసుల్లో భయాందోళన నెలకొంది.
ఇప్పటివరకు దారి తప్పి ఒకటో రెండో చిరుతలు కనిపించేవి. కానీ ఒకే చోట మూడు చిరుతలను చూసిన తండా వాసులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో పడిపోయారు. అవి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాయో తెలియదు కానీ.. రెండు రోజుల కింద తండా వాసి తారాసింగ్ కు ఒక చిరుత పిల్ల కనిపించగా ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ కు సమాచారం అందించారు. ఆయన వస్తానని చెప్పి పట్టించుకోలేదు. కనిపించిన చిరుత పిల్ల వెళుతుందిలే అని స్థానికులు కూడా అనుకున్నారు.
సోమవారం ఒకే సారి ఒక పెద్ద చిరుత, రెండు పిల్లలు కనిపించడంతో ఫొటోలు, వీడియోలు తీశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ కు మళ్లీ సమాచారం అందించారు. రేంజ్ ఆఫీసర్ కమాలుద్దీన్ తో కలిసి వచ్చే సరికి చీకటి పడింది. దీంతో తండా వాసులకు ధైర్యం చెప్పాడు. మంగళవారం బోను ఏర్పాటు చేసి పట్టుకుంటామని చెప్పి వెళ్లారు. రాత్రి పూట బయటకు వెళ్లొద్దని, కర్రను వెంట తీసుకెళ్లాలని ఆయన తండా వాసులకు సూచించారు.
