భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మావోయిస్టుల సమావేశం జరుగుతున్నదన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బలగాలు.. జిల్లా పరిధిలోని బెజ్జి-చింతగుఫా పోలీస్స్టేషన్ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతాల్లోకి కూంబింగ్ కు వెళ్లాయి. దట్టమైన అడవులు, గుట్టల్లో తుమల్పాడ్ ఏరియాలో మావోయిస్టులు ఉన్నట్లు గమనించిన బలగాలు లొంగిపోవాలని మావోయిస్టులను హెచ్చరించాయి.
కానీ, మావోయిస్టులు కాల్పులకు దిగారు. కాల్పులను ప్రతిఘటిస్తూ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. తర్వాత ఎన్కౌంటర్ ప్రదేశంలో పరిశీలించగా.. బలగాలకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను కుంట ఏరియా కమిటీ కమాండర్ మడవి దేవా, పొడియం గంగి, కిష్టారం ఏరియా కమిటీ సభ్యురాలు సోడి గంగిగా గుర్తించారు. ఆ ముగ్గురిపైనా రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఘటనా స్థలంలో 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
