చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ .. ముగ్గురు నక్సల్స్ మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్  ..  ముగ్గురు నక్సల్స్ మృతి

భద్రాచలం, వెలుగు:  చత్తీస్​గఢ్​లోని బీజాపూర్ జిల్లా నేండ్ర అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. నేండ్ర గ్రామ సమీపంలోని బేలం గుట్టల్లో మావోయిస్ట్ పార్టీ డివిజన్ కమిటీ మెంబర్ వినోద్ కర్మ, ఆవపల్లి ఎల్ఓఎస్ మెంబర్లు రాజు పూనెం, ఏసీఎం విశ్వనాథ్, తెల్లం గుడ్డుతో సహా 25 మంది మావోయిస్టులు సమావేశం అయ్యారనే పక్కా సమాచారంతో డీఆర్జీ, సీఆర్​పీఎఫ్ 210 బెటాలియన్ బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి.

 గుట్టల్లో మావోయిస్టులు తారసపడగా ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టులు పారిపోగా ఘటనాస్థలిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలం నుంచి విప్లవసాహిత్యం, నిత్యావసర సరుకులు, రెండు బర్మార్ తుపాకులు, ఒక పిస్టల్, 15 జిలెటిన్ స్టిక్స్, 5 డిటోనేటర్లు, 15మీటర్ల కొడెక్స్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.  

ల్యాండ్ మైన్ పేలి జవానుకు గాయాలు 

బీజాపూర్ జిల్లా గుండం తోయినాల గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఎస్టీఎఫ్ జవాను ప్రమోద్​శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అతడిని మెరుగైన చికిత్స కోసం రాయ్​పూర్​కు తరలించారు.