వీసా రిజెక్ట్​ అయ్యిందని యువకుడు సూసైడ్

వీసా రిజెక్ట్​ అయ్యిందని యువకుడు సూసైడ్
  • మృతుడు ఉప్పల్ హెడ్​కానిస్టేబుల్ కొడుకు

ఇబ్రహీంపట్నం, వెలుగు: వీసా రిజెక్ట్​అయ్యిందనే బాధలో ఆన్​లైన్​లో గడ్డి మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరుకు చెందిన గజాడి మల్లేశ్ ఉప్పల్​ట్రాఫిక్​పోలీస్​స్టేషన్​లో హెడ్​కానిస్టేబుల్. ఇతను కొంతకాలంగా అబ్దుల్లాపూర్​మెట్​మండలం తుర్కయాంజల్ ఏవీ నగర్​లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మల్లేశ్​పెద్ద కొడుకు శివకుమార్(25) సిటీలోని ఎంజీఐటీలో కాలేజీలో చదువుతున్నాడు. 

కొంతకాలంగా విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా వీసా రిజెక్ట్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆన్​లైన్ లో గడ్డి మందు ఆర్డర్ పెట్టి, ఏప్రిల్ 25న తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మల్లేశ్​ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వారం రోజుల్లో ఎంగేజ్​మెంట్​ అంతలోనే.. 

పద్మారావునగర్: వారం రోజుల్లో ఎంగేజ్ మెంట్ ఉందనగా, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వారాసిగూడలోని బౌద్ధనగర్ కు చెందిన గడ్డం మోహన్ కృష్ణ(30) బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మోహన్​కు ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. మే 4న అతడికి ఎంగేజ్ మెంట్ ఉండగా, ఏప్రిల్​27న ఇంట్లో చీరతో ఉరేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకుకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని తల్లి లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అయితే, అదే రోజు పార్సిగుట్టలో జరిగిన శ్యాంసన్ రాజు హత్యకు ఈ యువకుడి ఆత్మహత్యకు సంబంధం ఉందన్న ప్రచారం స్థానికంగా జరిగింది. తన బామ్మర్ది చేతిలో శ్యాంసన్ రాజు హత్యకు గురి కాగా, హత్యను చూసిన తనను ఈ కేసులో సాక్షిగా ప్రవేశపెడతారన్న భయంతో మోహన్ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదని వారాసిగూడ ఎస్ఐ సుధాకర్ తేల్చిచెప్పారు.

మద్యం తాగిరావద్దన్న భార్య.. భర్త ఆత్మహత్య

కూకట్​పల్లి: కూకట్​పల్లిలో భార్యతో గొడవపడిన ఓ ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ ఏరియాలో ఉండే బి.భీమ్​రావు(43), శివలింగ భార్యాభర్తలు. భీమ్​రావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి అలవాటుపడిన ఇతను రోజూ సాయంత్రం ఫుల్లుగా తాగి ఇంటికి వస్తున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల కింద మరోసారి భార్య శివలింగతో గొడవపడ్డ భీమ్​రావు ఆటో తీసుకుని బయటికి వెళ్లి తిరిగి రాలేదు. 

ఐదు రోజుల కింద ఇంటికి వచ్చాడు. ఆటో రిపేర్​కోసం భార్య దగ్గర రూ.500 తీసుకుని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. బుధవారం సాయంత్రం భార్యకు ఫోన్​చేసి తాను ఇంటికి రావాలా వద్దా అని అడిగాడు. మద్యం తాగకుండా ఇంటికి రావాలని భార్య శివలింగ చెప్పింది. ఆ తర్వాత కూకట్​పల్లి ఉదాసీన్​మఠ్​కు చెందిన అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు భీమ్​రావు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన స్థానికులు డయల్100కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భీమ్​రావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నారు.